Meal With Mom: హోలీ వేడుకలకు కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచన చేసింది. హోలీ వేడుకలకు ముందు మీ తల్లులతో కలిసి భోజనం చేయడంతో ఈ పండుగను జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మీ తల్లులతో భోజనం చేసి ఆ ఫొటోలను #MaaKeSangKhana లేదా #MealWithMom ట్యాగ్స్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కోరింది. ఈ ఫొటోల్లో కొన్నింటిని భారత ప్రభుత్వం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రదర్శిస్తుందని తెలిపింది.
హోలీ ఏ ఏ దేశాల్లో జరుపుకుంటారు?
దివాలీ తర్వాత దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ 'హోలీ. ఉత్తర భారతదేశంలో రాక్షస పీడ తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాధిస్తారు. ఆ మర్నాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకొంటారు. చతుర్దశి నాడు కాముని దహనం అనంతరం పాల్గుణ పౌర్ణమి నాడు వచ్చే హోలీ పండుగను భారత్‌లోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్టు హిందూ పురాణాలు చెబుతున్నాయ్. సత్య యుగం అంటే ధర్మం నాలుగు పాదాలపైనా నడిచిన తొలియుగం అన్నమాట. సత్యయుగంలో హోలీ గురించి ఏం చెప్పారంటే 'హోలీ' అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను..హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు.
పురాణ కథనం
పురాణాల ప్రకారం విశ్వనాథుడు ఈ ఏకాదశి రోజున అమ్మవారిని తీసుకుని హిమాలయ పర్వతం నుంచి కాశీ నగరానికి వస్తాజు. ఈ సమయంలో భక్తులు ఆనందోత్సాహాలతో రంగులు చల్లుతూ పండుగ నిర్వహించుకున్నారని చెబుతారు. కాశీలో ఈ విధమైన హోలీ వేడుక నిర్వహించుకోవడం మూడు శతాబ్దాలుగా వస్తోంది. ఇందులో భాగంగా భక్తులు పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలపై రంగులు చల్లుతూ ఊరేగిస్తారు. ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇదే ఆనవాయితీని పాటిస్తున్నారు. ఈ సంప్రదాయ వేడుకల్లో ఆలయ ప్రధాన అర్చకులు ప్రాతినిథ్యం వహిస్తారు.
వారణాసిలో ఘనంగా
పాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ సారి హోలీ పర్వదినం మార్చి18 శుక్రవారం వచ్చింది. అయితే మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో హోలీ వేడుకలు ముందుగానే ప్రారంభమవుతాయి. ఇలాంటి ప్రాంతాల్లో వారణాసి ఒకటి. ఇక్కడ ఐదు రోజుల ముందుగానే రంగుల వేడుక మొదలైంది. పరమేశ్వరుడు, పార్వతి మాతల విగ్రహాలపై రంగులు జల్లి వేడుక చేసుకుంటారు.