మణిపూర్ లో పండే ఓ రకం మిరపకాయలకు, నారింజ పండ్లకు విశిష్టమైన జీఐ ట్యాగ్ లభించింది. ఆ రాష్ట్రంలోని ఉక్రుల్ జిల్లాలోని సిరారాకోంగ్ గ్రామంలో హతై అని పిలిచే మిరపకాయల్ని పండిస్తారు. ఎర్రటి రంగులో 9 ఇంచుల పొడవు పెరుగుతాయి ఇవి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఈ రకం మిరపకాయలు కేవలం ఇక్కడే లభిస్తాయి. వాటి పుట్టిల్లుగా ఈ గ్రామాన్నే భావిస్తారు. అందుకే వీటికి భౌగోళిక గుర్తింపు లభించింది.
అలాగే మణిపూర్ లోని తామెంగ్లాంగ్ జిల్లాలో పండే నారింజ పండ్లు కూడా ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ జిల్లాను ‘ద ఆరెంజ్ బౌల్ ఆఫ్ మణిపూర్’ అని పిలుస్తారు. ఈ పండ్లు మిగతా వాటితో పోలిస్తే చాలా రుచిగా, జ్యూసీగా ఉంటాయి. విటమిన్ సి ను కూడా అధికంగా కలిగి ఉంటాయి. అందుకే ఈ ప్రాంతానికే ప్రత్యేకమైన ఈ పండ్లకు జీఐ ట్యాగ్ లభించింది.
ఏంటీ జీఐ ట్యాగ్? ఉపయోగాలేంటి?
భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) అనేది కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపు. ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999 ప్రకారం వీటిని ఇస్తారు. ఒక ప్రాంతంలో పండే లేదా తయారు చేసే ప్రత్యేక వస్తువులకు, ఉత్పత్తులకు ఈ గుర్తింపు లభిస్తుంది. అలాగే ఇలా జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులను, గుర్తింపు పొందిన వారి అనుమతి తీసుకోకుండా ఎక్కడా ఉత్పత్తి చేయడానికి లేదా పండించడానికి వీల్లేదు. వీటికి ప్రపంచమార్కెట్లో ఆదరణ పెరుగుతుంది. చాలా సంస్థలు వీటిని అమ్మేందుకు ముందుకు వస్తాయి.
ఇలా జీఐ ట్యాగ్ లభించడం ఆ ఉత్పత్తి తాలూకు విలువ పెరుగుతుంది. దీని ద్వారా మార్కెటింగ్ చేసుకునేందుకు వీలవుతుంది. వాణిజ్య పరంగా మంచి అవకాశాలు ఉంటాయి. దేశ వ్యాప్తంగా చాలా ఉత్పత్తులకు, వస్తువులకు ఈ జీఐ ట్యాగ్ లభించింది. బాస్మతి బియ్య, డార్లిలింగ్ తేయాకు, పోచంపల్లి చీరలు, కొల్హాపురి చెప్పులు, బొబ్బిలి వీణ, నిర్మల్ బొమ్మలు, మైసూరు పట్టు ఇలా... చాలా ప్రత్యేక ఉత్పత్తులు భౌగోళిక గుర్తింపును సాధించాయి.
Also read: రోజుకో గంట చూయింగ్ గమ్ నమిలితే ఒత్తిడి హుష్..
Also read: పోస్ట్ కోవిడ్ పరిస్థితులు గర్భధారణపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?
Also read: భోజనం చేశాక ఈ పనులు చేయకండి... అనారోగ్య సమస్యలు తప్పవు