భార్యతో గొడవ పడితే.. ఇంట్లో వస్తువులను పగలగొడతారు, లేదా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా చర్చికే నిప్పు పెట్టాడు. ఎందుకిలా చేశావని అడిగితే.. అతడు ఊహించని సమాధానం ఇచ్చాడు. తమ గొడవ కారణం ఆ చర్చేనని వెల్లడించాడు.
ఏం జరిగింది?: జూన్ 26 ఉదయం, రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ జిల్లా పార్గోలోవో గ్రామంలోని సెయింట్ బాసిల్ ది గ్రేట్ చర్చిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది కోసం వేచి చూసి ఉంటే.. చర్చి మొత్తం కాలి బూడిదైపోయి ఉండేది. తమ కళ్లముందే చర్చి అలా కాలిపోతుంటే.. చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చెడుకు సంకేతమని భావించారు. మరింత అందమైన చర్చి నిర్మిస్తే కీడు పోతుందనుకున్నారు.
చర్చిలో షార్ట్ సర్క్యూట్ కారణంతోనే ఈ ప్రమాదం జరిగిందని అనుకున్నారు. కానీ, అసలు నిజం వేరే ఉంది. ఈ పనిచేసింది మరెవ్వరో కాదు, స్థానిక వ్యక్తే. 36 ఏళ్ల వయస్సు గల వ్యక్తి(పేరు వెల్లడించలేదు) తన భార్యతో నిత్యం గొడవపడేవాడు. తాను కష్టపడి సంపాదిస్తున్న మొత్తాన్ని.. భార్య చర్చికి విరాళంగా ఇచ్చేయడం అతడికి అస్సలు నచ్చలేదు. దీంతో అతడు తన భార్యపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు.
చర్చిలో ఎవరూలేని సమయంలో తన కారు ట్రంక్‌లో ఉన్న గ్యాసోలిన్ డబ్బా పట్టుకుని లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత గోడలపై ఇంధనాన్ని చల్లాడు. అనంతరం చర్చికి నిప్పటించాడు. అయితే, పోలీసులకు అతడిని పట్టుకోడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే, తన నలుగురు పిల్లల భవిష్యత్తు కోసం తాను కష్టపడి పనిచేస్తున్నానని, కానీ.. తన భార్య ఆ మొత్తాన్ని చర్చికి విరాళంగా ఇచ్చేస్తోందని తెలిపాడు. ఆమెను ఎన్నోసార్లు వారించానని, మాట వినకుండా అదే పనిచేస్తోందన్నాడు. మరో మార్గం లేకపోవడంతో చర్చిని తగలబెట్టానని తెలిపాడు. ఇందుకు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తానని చెప్పాడు. అయితే, అతడికి ఏ శిక్ష విధించారనేది తెలియరాలేదు.
Also Read: మహిళలకు భర్తను అద్దెకిస్తున్న భార్య, రోజుకు రూ.3 వేలు ఆదాయం!