Khammam Politics : ఖమ్మం జిల్లాలో కొత్త సంస్కృతి మొదలైంది. సాధారణంగా ఎవరి ఇంటికైనా వివాహానికి వెళితే నూతన దంపతులకు బహుమతులు ఇస్తుంటారు. అయితే ఇది పాత పద్ధతి ఇప్పుడు ఖమ్మంలో మాత్రం తమ ఇంటికి పెళ్లికి రండి అంటూ ముందుగానే బహుమతులు ఇచ్చే సంస్కృతి వచ్చేసింది. ఈ బహుమతి ఏంటనుకుంటున్నారు? ప్రతి రోజు మన సమయం చూసే గోడ గడియారాలండి. అందులో విశేషం కూడా ఉంది. నాయకుల ఫొటోలు సమయం చూసుకున్న ప్రతిసారి మనకు కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి సమయంలోనూ తమను మరిచిపోవద్దనే విధంగా నాయకుల ఫొటోలు వారి ఇంట్లో వివాహ ఆహ్వానం ఇందులో కనిపిస్తుంది. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కుమారుడు నయన్‌రాజు వివాహం జరగనుంది. ఇదే కాకుండా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డి వివాహం కూడా జరగనుంది. ఈ రెండు పెళ్లిలకు జిల్లా ప్రజలను, కార్యకర్తలను ఆహ్వానం పలికేందుకు గోడగడియారాలు సిద్ధమయ్యాయి.
పొంగులేటి కుమారుడి వివాహంతో
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడి వివాహ వేడుకల సందర్భంగా గోడ గడియారాల పంపిణీ సంస్కృతి ప్రారంభమైంది. అంగరంగవైభవంగా చేసిన ఈ వివాహానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆహ్వాన పత్రికలతోపాటు గోడగడియారాలు పంపిణీ చేశారు. పొంగులేటి అభిమానుల ఇళ్లలో ప్రస్తుతం ఈ గోడగడియారాలే ముందుగా దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కుమారుడు నయన్‌రాజ్ వివాహం సందర్భంగా అదే తరహాలో గోడ గడియారాలను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే కాకుండా మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డి వివాహానికి ఆహ్వానం పలికేందుకు గోడ గడియారాలు సిద్ధమయ్యాయి. ఈ ఇద్దరు బడా నేతల ఇళ్లలో జరిగే వివాహానికి గోడగడియారాలు సిద్ధం కావడంతో ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఆ ఇద్దరి నేతల గోడగడియారాలు ప్రత్యక్షం కానున్నాయి.
మమ్మల్ని మరవకండి
రాజకీయ వ్యూహంలో భాగంగా ప్రతి సమయంలో మమ్మల్ని మరవకండి అనే విధంగా గోడగడియారాలు ఇప్పుడు ఇళ్లలో కళకళలాడనున్నాయి. ఓ వైపు బహుమతి ఇవ్వడంతోపాటు సమయం చూసుకున్న ప్రతిసారి తమను మరవద్దనే విధంగా గోడగడియారాలతో కొత్త రాజకీయానికి ఇద్దరు నేతలు శ్రీకారం చుట్టారు. అయితే ప్రతి రోజు వీరిచ్చే గోడగడియారాలు చూసుకునే ప్రజలు ఎవరి సమయం బాగుచేస్తారనేది చూడాల్సిందే.