పాములు కుబుసం వదలడం గురించి మీరు వినే ఉంటారు. అవి ఎప్పటికప్పుడు వాటి చర్మాన్ని వదిలేస్తూ.. కొత్త చర్మాన్ని పొందుతాయి. బీహార్‌కు చెందిన ఈ యువకుడి పరిస్థితి కూడా అంతే. కుబుసం వదలడమనేది పాముల్లో సహజంగా జరిగే ప్రక్రియ. అదే మనుషుల్లో జరిగితే.. అది అసహజం. ఆరోగ్యానికి అంత్యంత ప్రమాదకరం. ప్రస్తుతం ఈ యువకుడు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. ఈ సమస్య వల్ల అతడు నలుగురిలో తిరిగలేపోతున్నాడు.. ఇతరులతో కలవలేకపోతున్నాడు. అయితే, మనసులో ఎంత బాధ ఉన్నా.. అధైర్యపడకుండా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యువకుడు.
25 ఏళ్ల మజిబర్ రెహ్మాన్ మాలిక్ అనే ఈ యువకుడు ఎరిత్రోడెర్మా(erythroderma) అనే ప్రాణాంతక చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. దీనివల్ల అతడి చర్మం వాచిపోతూ పొట్టుగా రాలిపోతుంటుంది. ఫలితంగా చర్మం ఎర్రగా కమిలిపోతుంది. ఈ పరిస్థితిని ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తుంటారు. మాలిక్‌కు పుట్టక నుంచే ఈ సమస్య మొదలైంది. ప్రతివారం అతడు కుబుసం విడుస్తున్నట్లుగా చర్మాన్ని వదులుతాడు. చలికాలం వచ్చిందంటే మరింత నరకం. అతడ చర్మం పొడిగా మారిపోయి చిట్లిపోతుంది.
స్థానికంగా ఎన్నో హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ కోసం ప్రయత్నించాడు. అయితే, ప్రతి డాక్టర్ ఒకటే మాట. ‘‘ఇక్కడి ఆసుపత్రుల్లో నీ సమస్యకు ట్రీట్మెంట్ లేదు. పెద్ద ఆసుపత్రులకు వెళ్లు’’ అని సూచించేవారు. కానీ, ఆర్థిక సమస్యల వల్ల అతడు, అతడి కుటుంబం ఆ ప్రయత్నం చేయలేదు. మాలిక్‌కు స్కూల్‌కు వెళ్లడమంటే చాలా ఇష్టం. అయితే, అతడి రూపాన్ని చూసి స్కూల్ పిల్లలు భయపడుతున్నారనే కారణంతో చదువుకు కూడా దూరమయ్యాడు.
Also Read: సూపర్ మ్యాన్ సిండ్రోమ్, ఇది కూడా వ్యాధే - మీ నాన్నగారిలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
అయితే, తనకు ఉన్న సమస్య గురించి ఆలోచిస్తూ బాధతో కుమిలిపోవడం మాలిక్‌కు ఇష్టం లేదు. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చేస్తూ తన పరిస్థితి గురించి ఇతరులకు వివరిస్తున్నాడు. ఈ చర్మ సమస్య వల్ల మాలిక్ కళ్లు ఎర్రగా మారిపోయాయి. ఒక కంటికి చూపు కూడా పోయింది. ఇంకో కన్ను కూడా క్రమేనా చూపును కోల్పోతున్నట్లు మాలిక్ చెప్పాడు. ‘‘నా సమస్యను నేను బలంగా మార్చుకున్నాను. మీకు ఏమైనా సమస్య ఉంటే కుమిలిపోకూడదు. ఇతరులు ఏమనుకుంటున్నారనేది నేను పట్టించుకోను. నా కుటుంబం, నా స్నేహితులు నాకు తోడుగా ఉన్నారు. కాబట్టి, నేను హ్యాపీగానే ఉన్నాను’’ అని మాలిక్ తెలిపాడు. అయితే, మాలిక్‌కు చికిత్స సాధ్యం కాదా? చర్మ వ్యాధి నిపుణులు అతడి సమస్యను పరిష్కరించలేరా? నిపుణులు ముందుకొచ్చి.. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఈ యువకుడిని ఆదుకోవాలని కోరుకుందాం.
Also Read: 11 మినిట్స్, 7 హవర్స్, త్రిపుల్ 20 - ఇవి మీ ఆయుష్సును ఏ విధంగా నిర్ణయిస్తాయో తెలుసా?