అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో కొందరు కారులో వెళ్తున్నారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత వారి ముందు నుంచి ఓ భారీ ఆకారం ముందుకెళ్తూ కనిపించింది. దీంతో వారు కారు ఆపి హెడ్‌లైట్స్ వెలుగుల్లో దాన్ని చూశారు. అంతే, వారికి గుండె ఆగినంత పనైంది. అది మనిషి రూపంలో ఉన్న మేక లేదా, మేక రూపంలో ఉన్న మనిషో అర్థం కాలేదు. దాని ముఖం చూసేందుకు అచ్చం మేకలాగే ఉంది. దాదాపు ఆరు అడుగుల ఎత్తున్న ఆ భారీ కాయం కాళ్లు కూడా మేకలాగానే ఉన్నాయి. కానీ, చాలా పెద్దగా ఉన్నాయి. రోడ్డు దాటిన తర్వాత అది పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. అప్పటికే ఆ కార్లో ఉన్నవారికి గుండె జారింది. క్షణం ఆలస్యం చేయకుండా కారును వేగంగా పోనిచ్చారు.
ఈ ఘటన స్టావర్టన్‌లోని నార్తాంప్టన్‌షైర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆ మేక మనిషి(Man Goat)ని చూసిన వ్యక్తులు(పేరు వెల్లడించలేదు) మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. కారు ముందుకు కదులుతున్న సమయంలో అది ఒక్కసారే మీదకు దూసుకొచ్చిందని పేర్కొన్నారు. కొద్ది నిమిషాలు అటూ ఇటూ తిరిగి మాయమైందని తెలిపారు. అది సుమారు ఆర అడుగుల ఎత్తు ఉందని, కాళ్లు పొట్టిగా, బలంగా ఉన్నాయన్నారు. ‘‘అది జింక లేదా దుప్పి కాదు. ఎందుకంటే దానికి వెనుక కాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లోని ఒక మైలు దూరం వరకు ఎక్కడా ఇళ్లు, భవనాలు కనిపించలేదు’’ అని తెలిపారు.
Also Read: జలుబు చేసి గతాన్ని మరిచిపోయిన మహిళ.. 20 ఏళ్ల మెమరీ మొత్తం లాస్!
ఉదయం వెనక్కి వెళ్లి వెతికాం: ‘‘రాత్రి కనిపించిన ఆ వింత మనిషిని వెతికేందుకు తర్వాతి రోజు అదే రోడ్డులో ప్రయాణించాం. మాకు అది కనిపించిన ప్రాంతంలో దాని కోసం జల్లెడపట్టాం. కానీ అది కనిపించలేదు. ఆ పరిసర ప్రాంతాల్లో, పొలాల్లో ఎక్కడా జంతువులు నివసించడం లేదు’’ అని తెలిపారు. అయితే అది ‘వాలబీ’ (కంగారు) కావచ్చని మరికొందరు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి యూకేకు తీసుకొచ్చిన కంగారుల్లో కొన్ని తప్పించుకున్నాయని, అవి అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నాయని సమాచారం. బహుశా.. వారికి కనిపించినది కంగారు జంతువే కావచ్చని భావిస్తున్నారు. ఆ సమాచారం చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా చేరడంతో ప్రస్తుతం అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. రాత్రివేళ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.
Also Read: ఉదయాన్నే శృంగారంలో పాల్గోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?