Maha Shivaratri 2025 Rituals : హిందువులు భక్తి శ్రద్ధలతో ఉపవాసం, జాగారం చేస్తూ.. అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ మహా శివరాత్రి. శివుడికి పూజలు చేయడం నుంచి.. ఉపవాసం, శివరాత్రి జాగరణ ఈ ఫెస్టివల్లో అత్యంత ప్రధానంగా ఉంటుంది. అసలు ఈ మహా శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు. ఈ ఏడాది ఏ తేదీన ఈ పండుగను చేసుకుంటున్నారు? శివరాత్రి పండుగ వెనుక ఉన్న చరిత్ర ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మహా శివరాత్రి 2025 తేది
శివుడి భక్తులు ఎంతగానో ఎదురు చూసే మహాశివరాత్రి 2025లో బుధవారం ఫిబ్రవరి 26వ తేదీన వచ్చింది. పూజా సమయాలు ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి భక్తులు తాము ఉండే ప్రదేశాలకు అనుగుణంగా ఈ పూజను చేసి.. ఉపవాస, జాగరణలు చేయవచ్చని పండితులు సూచిస్తున్నారు.
మహా శివరాత్రి ప్రాముఖ్యత
హిందూ మతంలో మహాశివరాత్రికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు. పరమశివుని పూజించడానికి ఇది అత్యంత పవిత్రమైన రాత్రిగా చెప్తారు. భక్తి శ్రద్ధలతో, స్వీయ క్రమ శిక్షణతో చీకటిని, అజ్ఞానాన్ని అధిగమించడాన్ని ఈ పండుగ సూచిస్తుంది. శివ జాగరణ చేస్తే.. శాంతి, శ్రేయస్సు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారని భక్తులు నమ్ముతారు.
మహా శివరాత్రి చరిత్ర..
మహా శివరాత్రి జరుపుకోవడం వెనుక అనేక పౌరాణిక కథలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
శివ, పార్వతుల వివాహాం : స్కంద పురాణం ప్రకారం.. శివ, పార్వతి వివాహా సమయాన్ని మహా శివరాత్రిగా చెప్తారు. శక్తి, శివుల కలయికకు దీనిని ప్రతీకగా భావించి పండుగను చేసుకుంటారు.
సముద్ర మథనం : సముద్ర మథనం సమయంలో వచ్చిన విషం.. విశ్వాన్ని నాశనం చేయగలిగే శక్తి కలదని.. దానిని పరమశివుడు తాగి.. ప్రపంచాన్ని రక్షించాడని.. ఆ నిస్వార్థ చర్యను గుర్తు చేసుకుంటూ మహా శివరాత్రి జరుపుకుంటారని కొందరు భావిస్తారు.
లింగోద్భవ కథ : శివుడు అనంతమైన కాంతితో.. లింగోద్భవ రూపంలో కనిపించాడని భక్తులు నమ్ముతారు. ఆరోజును మహా శివరాత్రిగా జరుపుకుంటారు.
మహా శివరాత్రిని ఎలా చేసుకుంటారంటే..
మహా శివరాత్రిని భక్తులు వివిధ ప్రాంతాల్లో వారి ఆచారాలకు అనువుగా పూజా విధానాలు పాటిస్తూ జరుపుకుంటారు. ప్రధానంగా ఉపవాసం, జాగారం చేస్తారు. కొందరు నీరు కూడా ముట్టకుండా కఠిక ఉపవాసం చేస్తే.. మరికొందరు పండ్లు, పాలు, నీళ్లు మాత్రమే తీసుకుంటూ ఫాస్టింగ్ చేస్తారు. శివుడికి పాలు, బిల్వ ఆకులు, తేనె, నీరు సమర్పిస్తూ.. పూజ చేస్తారు. "ఓం నమః శివాయ" పఠిస్తూ.. శివుని పాటలు వింటారు. రాత్రంతా మేల్కొని జాగరణ చేస్తారు. మరికొందరు భక్తులు శివాలయాల్లో పండుగను చేసుకుంటారు.
సంవత్సరంలో ప్రతి నెలలో ఓ శివరాత్రి ఉంటుంది. వాటిలో మహా శివరాత్రికి పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఒక్క రోజు ఉపవాసం చేస్తే.. అత్యంత మంచి ఫలితాలు పొందుతారని భక్తులు నమ్ముతారు. అయితే ఉపవాసం చేయడం, చేయకపోవడం పూర్తిగా వ్యక్తిగతమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో ఉపవాసం చేస్తే మంచిది. అలాగే జాగారం చేసేప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. శివరాత్రిని సంతోషంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సెలబ్రేట్ చేసుకోవచ్చు.
Also Read : శివరాత్రికి ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే.. ఎందుకంటే