Maha Shivratri Fasting Rituals : భారతీయులు చేసుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. శివుని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. శివుడు, పార్వతి దేవిని వివాహం చేసుకున్న రోజుగా దీనిని చెప్తారు. అయితే ఈ సమయంలో చాలామంది భక్తులు ఉపవాసం, జాగారం చేస్తారు. ఈ సంవత్సరం శివరాత్రి మార్చి 8వ తేదీన వస్తుంది. మహాశివరాత్రి ఉపవాసం పండుగ రోజు ఉదయం ప్రారంభమై.. రాత్రి జాగారం తర్వాత ఉదయం ముగుస్తుంది. అంటే మార్చి 8వ తేదీన ఉపవాసం చేస్తే.. 9వ తేదీన ఉదయం ఉపవాసాన్ని విరమించవచ్చు. 


ఏడాది పొడవునా.. ప్రతినెలలో ఒక శివరాత్రి ఉంటుంది. కానీ మహా శివరాత్రికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఒక్క మహాశివరాత్రికి ఉపవాసం చేస్తే.. ఏడాది పొడవునా మంచి ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. ఎవరైతే తనను ఆరాధిస్తారో.. వారు తన కొడుకు కార్తికేయుడు కంటే ప్రీతిపాత్రుడు అవుతాడని శివుడు వాగ్దానం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. అయితే మీరు కూడా శివుని సేవలో తరించేందుకు ఉపవాసం చేస్తున్నారా? అయితే మీరు కొన్ని సూచనలు ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు. ఉపవాస సమయంలో ఆరోగ్యంగా, హైడ్రేటెడ్​గా, డిటాక్సిఫైడ్​, పునరుజ్జీవనం పొందడంలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే.. 


మానసికంగా సిద్ధంగా ఉండాలి.. 


మీరు పవిత్రమైన ఉపవాసాన్ని చేస్తున్నప్పుడు సంతోషంగా, ప్రశాంతంగా, పూజలు చేసుకుంటూ.. రోజంతా సాఫీగా ఉండాలని చూస్తున్నారా? అయితే మనసికంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇబ్బంది కలిగించే విషయాలకు దూరంగా ఉండండి. దీనివల్ల ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు. మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం వల్ల ఉపవాసాన్ని మరింత సులభంగా చేసుకోవచ్చు. 


హైడ్రేట్​గా ఉండాలి.. 


శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉపవాసం ఉన్నప్పుడు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. ఇది శరీరం నుంచి టాక్సిన్స్, వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. మీరు ఉపవాసం సమయంలో నీటి మాత్రమే తీసుకుంటే.. కచ్చితంగా శరీరంలోని అన్ని భాగాలు హైడ్రేట్ అయ్యేలా నీటిని తీసుకోవాలి. ఇది మీరు శక్తివంతంగా ఉండడానికి, అలసట, ఆకలిని కంట్రోల్​లో ఉంచుతుంది.


శారీరక శ్రమ..


ఉపవాస సమయంలో శారీరక శ్రమ ఎక్కువ లేకుండా చూసుకోండి. మీరు డెస్క్ వర్క్ చేసుకునే వారు అయితే.. పని చేసుకోవచ్చు. లేదంటే పనులు చేయకుండా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, భక్తి సంగీతం వినడం లేదా మనసుకు హాయినిచ్చే ధ్యానం చేయడం వంటి కాలక్షేపాలు ఎంచుకోవచ్చు. 


డిటాక్స్ చేయడం కోసం


కొందరు ద్రవ ఆహారాలతో ఉపవాసం చేస్తారు. ఆకలితో ఉండటం కష్టంగా భావించే వారు.. లేదా ఆరోగ్య సమస్యలున్నవారికి ఈ రకమైన ఉపవాసం మంచిది. లేదు మేము ఏమి తాగము అని ఉంటే.. తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భిణీ స్త్రీలు, మధుమేహమున్నవారు, జీర్ణ సమస్యలు, బలహీనత వంటి ఆరోగ్య సమస్యలున్నవారు కనీసం ద్రవ రూపంలో అయినా శరీరానికి అవసరమైన పోషకాలు అందించాలి. జ్యూస్​లు, పాలు, మిల్క్​షేక్​లు, హెర్బల్​ టీ, పెరుగు లేదా మజ్జిగను చేర్చుకోవచ్చు. 


లైట్ ఫుడ్ 


ఉపవాసం అంటే కడుపు మాడ్చుకోవడం కాదు.. భగవంతునికి దగ్గరగా ఉండడమని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. అలాగే ఆకలి వేస్తున్న సమయంలో అమ్మో నేను ఉపవాసం అని పూర్తిగా మానేయడం కాకుండా లైట్​గా ఏమైనా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మీరు శివుడిపై పూర్తిగా ధ్యానం ఉంచగలుగుతారు. పండ్లు, మృదువుగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఎక్కువసేపు నమిలే ఫుడ్ తీసుకుంటే అంత మంచిది కాదు. కర్రపెండ్ల, బంగాళాదుంపలు, అరటిపండ్లు, బొప్పాయి, పుచ్చకాయలు వంటివి భర్తీ చేయవచ్చు.


ఉపవాసం విరమించిన తర్వాత..


ఉపవాసం విరమించే సమయంలో అన్నం తినేయకండి. ఇది చాలా ప్రమాదకరం. ఇది మీ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఉపవాసం విరమించాకా.. ముందు ఏదైనా జ్యూస్ తీసుకోవాలి. కాసేపు ఆగిన తర్వాత ఫ్రూట్స్​ తిని.. తర్వాత తేలికైన ఆహారం తీసుకోవాలి. ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా, కేలరీలు తక్కువ కలిగిన ఫుడ్ తీసుకోవాలి. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించి.. ఉపవాసం చేస్తే మంచిది. 


Also Read : శివరాత్రి వేళ శివయ్యకు ఈ నైవేద్యాలు పెట్టేయండి.. శివునికి ప్రీతికరమైనది ఇదే