WPL Runout Controversy: రనౌట్ ఇవ్వకపోవడంపై నెటిజన్ల ఫైర్.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ..

రూల్స్ ప్ర‌కారం ర‌నౌట్ స‌మ‌యంలో బెయిల్స్ లో వెలుగు ఏర్ప‌డిన స‌మ‌యాన్ని మాత్ర‌మే ప్ర‌మాణికంగా తీసుకుంటారు. ఆ స‌మ‌యంలో బ్యాట‌ర్ ఉన్న ఫ్రేమ్ ను ఫ్రీజ్ చేసి అంపైర్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 

Continues below advertisement

MI Vs DC Match Updates: డ‌బ్ల్యూపీఎల్ మూడో సీజ‌న్ ఉత్కంఠ భ‌రితంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన రెండు మ్యాచ్ లు ప్రేక్ష‌కుల‌కు మ‌జాను పంచాయి. తొలి మ్యాచ్ లో రికార్డు ఛేజింగ్ తో గుజ‌రాత్ జెయింట్స్ ను డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ట్టి క‌రిపించింది. టోర్నీలోనే కాకుండా మ‌హిళా క్రికెట్లోనే ఇది అత్య‌ధిక ఛేద‌న కావ‌డం విశేషం. ఇక శ‌నివారం జ‌రిగిన రెండో మ్యాచ్ అయితే సీడ్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ లాగా అభిమానుల‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. తొలుతు ముంబై 164 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, ఒక ద‌శ‌లో ఢిల్లీ 103-5తో క‌ష్టాల్లో నిలిచింది. అయితే నికీ ప్ర‌సాద్ (35) యాంక‌ర్ రోల్ పోషిస్తూ జ‌ట్టును దాదాపుగా విజ‌య‌తీరాల వ‌ర‌కు తీసుకెళ్లింది. అయితే చివ‌ర్లో 2 బంతుల్లో రెండు ప‌రుగులు చేయాల్సిన ద‌శ‌లో ఔట్ కావ‌డంతో ఉత్కంఠ తారా స్థాయికి చేరుకుంది. ఈ ద‌శ‌లో బ్యాటింగ్ కు దిగిన తెలుగ‌మ్మాయి అరుంధ‌తి.. సంజ‌న బౌలింగ్ లో బంతిని గాల్లోకి లేపి, రెండు ప‌రుగులు పూర్తి చేసింది. త్రో అందుకున్న హ‌ర్మ‌న్ ర‌నౌట్ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా, సేఫ్ గా క్రీజులోప‌లికి చేరుకుంది. దీంతో ఢిల్లీ క్యాంప్ ఆనంద డోలిక‌ల్లో మునిగి పోయింది. తాజాగా ఈ అంపైర్ నిర్ణ‌యం పై సోష‌ల్ మీడియాలో ట్రోల్ జ‌రుగుతోంది.

Continues below advertisement

ర‌నౌట్ అంటున్న నెటిజ‌న్లు..
ఈ మ్యాచ్ లో అరుంధ‌తి ర‌నౌట్ అని సోష‌ల్ మీడియాలో క్రికెట్ ప్రేమికులు పేర్కొంటున్నారు. త‌ను క్రీజులోకి చేరేస‌రికే వికెట్ల‌ను కీప‌ర్ గిరాటేసింద‌ని వాదిస్తున్నారు. అయితే నూత‌న నిబంధ‌న‌ల ప్ర‌కారం ర‌నౌట్ స‌మ‌యంలో బెయిల్స్ లో వెలుగు ఏర్ప‌డిన స‌మ‌యాన్ని మాత్ర‌మే ర‌నౌట్ కు ప్ర‌మాణికంగా తీసుకుంటారు. ఆ స‌మ‌యంలో బ్యాట‌ర్ ఉన్న ఫ్రేమ్ ను ఫ్రీజ్ చేసి అంపైర్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో అరుంధ‌తి నాటౌట్ గా మిగిలి జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించింది. 

విఫ‌ల‌మైన ముంబై..
టోర్నీ ఆరంభ మ్యాచ్ లో మాజీ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్ శుభారంభం చేయలేక పోయింది.  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియ‌న్స్ 19.1 ఓవ‌ర్ల‌లో 164 ప‌రుగుల‌కు ఆలౌటైంది. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ నాట్ స్కివ‌ర్ బ్రంట్ అజేయ అర్థ సెంచ‌రీ (59 బంతుల్లో 80 నాటౌట్, 13 ఫోర్లు)తో స‌త్తా చాటింది. బౌల‌ర్ల‌లో అన్నాబెల్ స‌ద‌ర్లాండ్ కు మూడు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేద‌న‌ను స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 165 ప‌రుగులు చేసి ఢిల్లీ పూర్తి చేసింది. విధ్వంస‌క ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మ (18 బంతుల్లో 43, 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచింది. హీలీ మాథ్యూస్, అమేలియా కెర్ కు రెండేసి వికెట్లు ల‌భించాయి. నికీ ప్రసాద్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. డిల్లీ తరఫున ఇదే అత్యుత్తమ ఛేదన కావడం విశేషం. ముంబై ఆలౌట్ కాకుండా.. చివ‌రి ఐదు బంతులు ఆడిన‌ట్ల‌యితే ఫ‌లితం వేరేలా ఉండేద‌ని ఆ జ‌ట్టు అభిమానులు పేర్కొంటున్నారు. 

Read Also: Big Blow For RCB: ఆర్సీబీ నుంచి కీలక ప్లేయర్ ఔట్.. గతేడాది కప్పు కొట్టడంలో కీ రోల్ పొషించిన స్పిన్నర్

Continues below advertisement