New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
New Delhi Railway Station News |ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఫిబ్రవరి 15న రాత్రి జరిగిన తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది.

Stampede at New Delhi Railway Station | న్యూఢిల్లీ: ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నార్తర్న్ రైల్వేకి చెందిన నర్సింగ్ దేవ్ (PCCM), పంకజ్ గంగ్వార్ (PCSC)లు ఈ విచారణ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు స్వాధీనం చేసుకుని రికార్డ్ అయిన వీడియోలను భద్రపరచాలని సంబంధిత స్టేషన్ అధికారులను విచారణ కమిటీ ఆదేశించింది.
శనివారం రాత్రి కుంభమేళాకు వెళ్లే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో ఢిల్లీ రైల్వేస్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు సమాయానికి రాకపోవడం, అదే సమయంలో వచ్చిన రైలు ప్రయాగ్ రాజ్‌కు వెళ్తుందని తెలియడంతో ఇతర ప్లాట్‌ఫాంలో ఉన్నవారితో పాటు స్టేషన్ బయటి నుంచి వచ్చిన వారు సైతం ప్లాట్‌ఫాం 14, 15 మీదకు వెళ్లారు. ఒక్కసారిగా భారీగా ప్రయాణికులు పోగవడం, రైలు అందుకోవాలన్న యత్నంలో తొక్కిసలాట జరిగి ప్లాట్ ఫాం మీద చాలా మంది స్పృహతప్పి పడిపోయారు. వారిలో 18 మంది చనిపోగా, కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 14 మంది మహిళలు ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట మృతుల వివరాలు
ఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతి చెందగా, మరో 25 మంది వరకు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మృతులంతా బిహార్, ఢిల్లీ వాసులుగా పోలీసులు గుర్తించారు.
మృతులు: శాంతిదేవి, పూజాకుమార్, పూనమ్, షీలా దేవి, వ్యోమ్, ఆహాదేవి, పింకి దేవి, పూనమ్ దేవి, నీరజ్, మనోజ్, లలితా దేవి, సురుచి, సంగీతా మాలిక్, మమతాఝా, కృష్ణ దేవి, విజయ్, రియాసింగ్, బేబీకుమారి
యూపీ సీఎం అలర్ట్..
యూపీ సీఎం యోగిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా పరిస్థితిని ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అన్నారు. సంతాపం ప్రకటించిన సీఎం యోగి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదివరకే మహాకుంభమేళాలో తొక్కిసలాట, అగ్నిప్రమాదాలు జరగడంతో ఢిల్లీ ఘటన గమనించి యోగి ఆదిత్యనాథ్ అప్రమత్తం అయ్యారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని హెలికాప్టర్ ద్వారా ప్రయాగ్ రాజ్‌లో ఏరియల్ సర్వే చేశారు.