New Delhi Stampede Compensation: న్యూఢిల్లీలో తొక్కిసలాట, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ భారీ పరిహారం- గాయపడితే రూ.2.5 లక్షలు
Compensation in New Delhi Railway Station stampede | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం తొక్కిసలాట జరిగి 18 మంది మృతిచెందారు, మరికొందరు గాయపడ్డారు. వీరికి రైల్వే శాఖ భారీ పరిహారం ప్రకటించింది.

ఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు. ఎంతో మంది లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాట మృతుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన వారికి సైతం రూ.2.5 లక్షల చొప్పున పరిహారం, స్వల్ప గాయాలైన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
మహా కుంభమేళాకు వెళ్దామనుకుంటే మహా విషాదం..
వీకెండ్ కావడం, అందులోనూ త్వరలో మహా కుంభమేళా ముగియనుందని భక్తులు ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్లాలని రైల్వేష్టేషన్‌కు వచ్చారు. శనివారం రాత్రి రైలెక్కి ఆదివారం ఉదయం కుంభమేళాకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిద్దామనుకున్నారు. కానీ రైల్వేస్టేషన్లో ప్రయాగ్ రాజ్ వెళ్లే రెండు రైళ్లు ఆలస్యం కావడం, వేరే ప్లాట్‌ఫాం మీద రైలు ఉందని వదంతులు ప్రచారం కావడం తొక్కిసలాటకు దారితీసింది. ఎలాగైనా రైలు క్యాచ్ చేయాలని 12, 13 ప్లాట్‌ఫాంలతో పాటు స్టేషన్ కు వస్తున్న వారు ఒక్కసారిగా ప్లాట్‌ఫాం 14, 15 మీదకు చొచ్చుకురావడంతో తొక్కిసలాట జరిగింది. రైలు ఎక్కాలని తోటి వారిని తొక్కుకుంటూ కొందరు రైలు అందుకున్నారు. ఈ క్రమంలో ఊపిరాడక కొందరు అక్కడికక్కడే స్పృహ కోల్పోయి తరువాత మృతిచెందారు.
రైల్వే కూలీలు, సిబ్బంది అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అంబులెన్సులలో బాధితులను లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో మహిళలు 14 మంది ఉన్నారని అధికారులు, ఢిల్లీ పోలీసులు తెలిపారు. మొదట రైల్వే సీపీఆర్వో అసలు తొక్కిసలాటే జరగలేదని.. అంతా ప్రశాంతంగా ఉందని ప్రకటించారు. విషయం గమనించాక తొక్కిసలాట నిజమేనని కొందరు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఆదివారం ఉదయానికి మృతుల సంఖ్య పద్దెనిమికి చేరినట్లు వెల్లడించారు.
ఢిల్లీ రైల్వే స్టేషన్లో భారీగా జనాలున్న ఫొటోలు, వీడియోలు.. తొక్కిసలాట అనంతరం హృదయ విదారకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంత రద్దీ వస్తుంటే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆప్ నేతలతో పాటు ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం కాదు, ప్రాణాలు పోకుండా చూడాలి కదా అని మోదీ ప్రభుత్వంపై, రైల్వే శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.