Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది మృతిచెందారు. మరో 25 మంది వరకు గాయపడ్డారు. ఒకేసారి 14, 15 ప్లాట్‌ఫాంలపైకి ప్రయాణికులు రావడంతో ఇలా జరిగిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

Delhi Railway Station Stampede News Updates | ఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగిన ఘటనలో 18 మంది మృతిచెందారు. మరో 25, 30 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 14 మంది మహిళలు ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆదివారం కావడంతో మహా కుంభమేళాకు వెళ్లేందుకే భారీ సంఖ్యలో భక్తులు శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ (Delhi Railway Station)కు పోటెత్తారు. స్టేషన్లో ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
తానేం చూశాడో చెప్పిన ప్రత్యక్ష సాక్షి
రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫాం 13లో ప్రయాణికులు చాలా మంది ఉన్నారని ప్రత్యక్ష సాక్షి రవి తెలిపాడు. ‘శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. 14, 15వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉందని గమనించారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో ప్రయాణికులు ఆ రెండు ప్లాట్‌ఫాంలపైకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అసలే రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా తొక్కిసలాట జరిగి పలువురు స్పృహ కోల్పోయారు. రైలు ప్లాట్‌ఫాం మార్చలేదు. కానీ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన రైలు వేరే ప్లాట్‌ఫాం మీద ఆగి ఉందని, మరో రెండు రైళ్లు ఆలస్యమని తెలియడంతో భారీ సంఖ్యలో రెండు ప్లాట్‌ఫాంల మీదకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ప్రయాణికులను నియంత్రించే పరిస్థితి కూడా లేదని’ ప్రత్యక్ష సాక్షి ఏఎన్‌ఐ మీడియాకు తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అనూహ్య రద్దీ కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కుంభమేళాకు వెళ్లే భక్తులు శనివారం భారీ సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అసలే రద్దీ ఎక్కువగా ఉండటం, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యమని తెలియడంతో మిగతా ప్లాట్‌ఫాంల నుంచి ఒక్కసారిగా 14, 15 ప్లాట్‌ఫాంల మీదకు భారీగా చేరుకున్నారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా తొక్కిసలాట జరిగినట్లు తెలిపారు. తక్కువ సమయంలో ఊహించనంత రద్దీ ఏర్పడి తొక్కిసలాటకు దారితీయడంతో తీవ్ర విషాదం నెలకొన్నట్లు పేర్కొన్నారు.