రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయిన విషయాన్ని మనం గుర్తించడం కష్టమే. కొన్ని రకాల లక్షణాల ద్వారా ఆ విషయం బయటపడుతుంది. వైద్యులు కొన్ని రకాల మందులు ఇవ్వడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. అయితే చాలామంది మందులు వేసుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటివారు ఆహార, వ్యాయామ నియమాలను పాటించడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఈ ఆహార వ్యాయామ నియమాలు పాటిస్తూ మందులు వాడితే ఇంకా త్వరగా తగ్గుతాయి. అధిక బరువు పెరిగిన వారిలో కొలెస్ట్రాల్ మోతాదులు అధికంగా ఉంటాయి. అలాగని సన్నగా ఉన్న వారిలో కొలెస్ట్రాల్ మోతాదులు ఉండవని కాదు, సన్నగా ఉన్నా లావుగా ఉన్నా వారి ఆహారపు అలవాట్లు, వ్యాయామ అలవాట్ల ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ అనేది పేరుకు పోతుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతే అది గుండెపోటుకు దారితీస్తుంది. అందుకే బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు లిపిడ్ ప్రొఫైల్ అంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎలా ఉన్నాయో పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవడం మంచిది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నట్టు గుర్తిస్తే కొన్ని రకాల పనులను చేయాల్సి ఉంటుంది.
ముందుగా ఆహార నియమాలను తెలుసుకుందాం. మీరు తినే ఆహారంలో నూనె తక్కువగా ఉండేలా చూసుకోండి. నెలకు ఒక మనిషి అర లీటరు నూనె కన్నా ఎక్కువ తినకపోవడం మంచిది కాదు. నలుగురు ఉన్న కుటుంబంలో నెలకు రెండు లీటర్ల నూనె వాడితే చాలు. అంతకన్నా ఎక్కువ వాడకపోతేనే మంచిది. చిరుతిళ్లు అధికంగా నూనెలోనే వేయిస్తారు. కాబట్టి అలాంటి చిరుతిండిని మానేసి పండ్లు వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినాలి. అవిసె గింజలు, పచ్చిబఠానీలు, బీన్స్, అంజీర, ఖర్జూరం, బ్రకోలీ, చిలకడదుంపలు, బత్తాయి, ఆపిల్, మొక్కజొన్నలు, క్యాబేజీ, క్యారెట్లు వంటివి అధికంగా తినాలి. వీటిని తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోదు. పైగా ఎంతో ఆరోగ్యం కూడా.
ప్రతిరోజూ అరగంట పాటు వాకింగ్ చేయాలి. అలాగే రన్నింగ్ చేయడం వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుంది. సైకిల్ తొక్కితే ఇంకా మంచిది. వారానికి కనీసం రెండు గంటల సేపైనా ఏరోబిక్ వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. రోజుకి 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు చొప్పున ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే వాటిని మానేయడం చాలా అవసరం. పొగ పీల్చడం వల్ల కొవ్వు మోతాదులు పెరుగుతాయి. ధూమపానం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే ఛాన్సులు అధికం. కాబట్టి ధూమపానం అలవాటు ఉంటే వెంటనే మానేయాలి.
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవలసిన అవసరం ఉంది. అందుకే యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి. మానసిక ఒత్తిడి పెరిగినా కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. శ్రావ్యమైన సంగీతాన్ని వినడం, కామెడీ సీన్లు చూడడం ద్వారా నవ్వడానికి ప్రయత్నించండి. ఎంత నవ్వితే మానసిక ఒత్తిడి అంతగా తగ్గిపోతుంది.
Also read: కరివేపాకే కదా అని తీసిపారేయకండి, బరువుని ఇట్టే తగ్గించేస్తుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.