కొన్ని రకాల చిన్న చిన్న లక్షణాలను గమనించుకుంటే ప్రమాదాలను ముందుగా పసిగట్టే అవకాశాలు చేజార్చుకోకుండా ఉండొచ్చు అనేది హెల్త్ లైన్ నిపుణుల అభిప్రాయం. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య రోజు రోజు కి పెరుగుతోంది. చాలా రకాల క్యాన్సర్లలో ప్రాథమిక స్థాయిలో ఎలాంటి లక్షణాలు కనిపించక పోవడం వల్ల మరణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి.


నోట్లో కనిపించే కొన్ని చిన్న చిన్న మార్పులే నోటి క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. నోటి క్యాన్సర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.


దంతాలు వదులవడం, రకరకాల కారణాలతో ఈ సమస్య రావచ్చు. ఏదైనా దెబ్బతగలడం వల్ల కూడా దంతాలు వదులై పోవచ్చు. ఇలాంటి ఏ కారణం లేకుండానే దంతాలు వదులైతే ఇది నోటి క్యాన్సర్ కు సంకేతం కావచ్చు. నోటిలో ట్యూమర్ పెరగడం మొదలైన మొదట్లో ఇలాంటి లక్షణం ఎలాంటి కారణం లేకుండా కనిపించవచ్చట. నాలుక మీద, బుగ్గలలోపల, నోటిలో పై అంగిలి భాగంలో, పెదవులు లేదా చిగుళ్ల మీద ఎక్కడైనా అసాధారణ అల్సర్లు లేదా ట్యూమర్లు  కనిపించవచ్చు.


మౌత్ అల్సర్ల వంటివి ఎంతకు తగ్గకుండా ఉండడం. నోటిలోని లైనింగ్, నాలుక మీద తెలుపు లేదా ఎరుపు రంగు ప్యాచెస్ వంటి గుర్తులు ఏర్పడడం. మాట తీరు మారిపోవడం వంటి అనేక లక్షణాలు క్యాన్సర్ వల్ల కూడా కావచ్చు. కారణం లేకుండా దంతాలు వదులైతే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించి కారణం తెలుసుకోవడం అత్యవసరమని గుర్తించాలి.


ఈ మధ్య కాలంలో నోటి క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువ గా నమోదవుతున్నట్టు గణాంకాలు చెబుతాయి. లక్షణాలు కనిపించినంత మాత్రాన ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇవి క్యాన్సర్ వల్ల కూడా కావచ్చు. లేదా మరేదైనా ఇతర కారణం కూడా ఉండి ఉండవచ్చు.


నోటి క్యాన్సర్ లక్షణాలు



  • నోటిలో తరచుగా అల్సర్లు ఏర్పడడం, అవి వారాల వ్యవధిలో కూడా తగ్గకపోవడం

  • మెడ లేదా నోటిలో లంప్స్ ఏర్పడడం, అవి వాటంతట అవే నయం కాకపోవడం

  • ఎలాంటి కారణం లేకుండా దంతాలు వదులవడం

  • పెదవులు నాలుక మీద తిమ్మిరి వంటి వివరించలేని ఒక భావన ఉండడం, కొన్ని సార్లు నోటిలో, నాలుక మీద, లైనింగ్ పైన తెలుపు లేదా ఎరుపు రంగు ప్యాచెస్ కనిపిస్తాయి. ఇవి క్యాన్సర్ మొదలవుతుందని అనేందుకు సంకేతం కావచ్చు. కాబట్టి అశ్రద్ధ కూడదు.

  • మాటతీరులో స్పష్టత లోపించడం

  • ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండానే ఇతర ఏకారణం లేకుండానే మింగడానికి ఇబ్బందిగా ఉంటే తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. మింగడంలో కష్టం అంటే అన్నవాహిక క్యాన్సర్ కావచ్చు.

  • స్పష్టమైన కారణం లేకుండానే తరచుగా అలసి పోతుంటే మాత్రం కీడు శంకించాల్సిందే.


పైన చర్చించిన లక్షణాలు మూడు వారాలలో వాటంతట అవి తగ్గిపోక పోతే, మీకు పొగతాగడం, పొగాకు వాడకం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే వెంటనే డెంటిస్ట్ ను కలిసి అనుమానం నివృత్తి చేసుకోవడం అవసరం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.