Signs of Liver Damage : కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది జీర్ణక్రియ, నిర్విషీకరణ, ఎనర్జీ స్టోరేజ్ వంటి పనులు చేస్తుంది. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే.. మొత్తం ఆరోగ్యం క్షీణించవచ్చు. సమస్య ఏమిటంటే.. కాలేయానికి నష్టం వాటిల్లిన ప్రారంభ దశలో చాలామంది దాని సంకేతాలను గుర్తించలేరు. కానీ శరీరం మనకు అనేక సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా కళ్లు, చేతులు, కాళ్లు, పొత్తికడుపులో వివిధ లక్షణాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలను సకాలంలో గుర్తిస్తే.. కాలేయ సమస్యలు తీవ్రం కాకుండా ముందుగానే గుర్తించే సులభంగా దూరం చేసుకోగలుగుతారు.

Continues below advertisement


కళ్లలో పసుపు రంగు


మీ కళ్లలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారితే.. దానిని అస్సలు విస్మరించవద్దు. ఇది కామెర్లు (జాండీస్) సంకేతం. ఇది కాలేయం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. కాలేయం దెబ్బతిన్నప్పుడు రక్తంలో బిలిరుబిన్ పెరుగుతుంది. దీనివల్ల కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారుతాయి. ఇది కాలేయ సిరోసిస్, హెపటైటిస్ లేదా కాలేయ వైఫల్యానికి సంకేతం కావచ్చు.


చేతులపై ఎరుపు గుర్తులు


చేతులపై ఎరుపు మచ్చలు లేదా పాచెస్ కనిపించడం కూడా కాలేయ సమస్యకు లక్షణం. దీనిని పామర్ ఎరిథెమా అంటారు. ఈ పరిస్థితి కాలేయ తీవ్రమైన వ్యాధిలో కనిపిస్తుంది.


కాళ్లు, పాదాలలో వాపు


కాళ్లు లేదా పాదాలలో నిరంతరం వాపు ఉంటే.. ఇది కాలేయ సమస్యకు సంకేతం కావచ్చు. కాలేయం దెబ్బతిన్నప్పుడు, శరీరంలో ప్రోటీన్, ఆల్బుమిన్ స్థాయి తగ్గుతుంది. దీనివల్ల ద్రవం కాళ్లలో పేరుకుపోతుంది. దీనిని ఎడీమా అంటారు. ఆ సమయంలో కాళ్లు లేదా పాదాలలో వాపు కనిపిస్తుంది.


వైద్యుల సూచనలు..


డాక్టర్ షైస్తా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో కళ్లు, చేతులలోనే కాకుండా కాలేయ సమస్యలు పొత్తికడుపు, నిద్ర, కండరాలలో కూడా కనిపిస్తాయని చెప్పారు. ఆమె ప్రకారం.. పొత్తికడుపులో చాలా కాలంగా నొప్పి లేదా వాపు ఉన్నా దానిని విస్మరించవద్దని సూచిస్తున్నారు. ఇది కాలేయానికి నష్టం వాటిల్లడానికి సంకేతం కావచ్చని తెలిపారు. అటువంటి పరిస్థితిలో కాలేయ పనితీరుకు సంబంధించిన టెస్ట్ (LFT) చేయించాలన్నారు.


వికారం, ఆకలి తగ్గడం లేదా పదేపదే వాంతి వచ్చినట్లు అనిపించడం కూడా కాలేయం క్షీణించడానికి లక్షణం అని ఆమె అన్నారు. దీనితో పాటు.. ముదురు రంగు మూత్రం, చేతులు, కాళ్లలో వాపు, కండరాలలో నిరంతర బలహీనత, అలసట కాలేయ ఆరోగ్యం గురించిన సంకేతాలు శరీరం అందిస్తున్నట్లేనని తెలిపారు. డాక్టర్ షైస్తా ప్రకారం.. మీకు రాత్రి నిద్ర పట్టకపోతే లేదా నిద్ర విధానం మారితే అది కాలేయ పనితీరుపై ప్రభావానికి సంకేతం కావచ్చని వెల్లడించారు.


నివారణ చర్యలు



  • ఆల్కహాల్, అధిక నూనె కలిగిన ఆహారాన్ని దూరంగా ఉంచాలి.

  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండాలి.

  • క్రమం తప్పకుండా చెకప్ చేయించుకోవాలి.

  • వైద్యుని సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోకూడదు.


వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే..


ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. LFT, అల్ట్రాసౌండ్, ఇతర పరీక్షలు వైద్యుల సూచనలతో చేయించుకోవాలి. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభం. కానీ ఆలస్యం అయితే కాలేయం పూర్తిగా  వైఫల్యమవడం లేదా మార్పిడి చేయించుకోవాల్సి వస్తుంది.



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.