ఆఫ్రికాలో పుట్టిన ప్రాణాంతక వైరస్ ఎబోలా.ఈ వైరస్ సోకాక ఆ మనిషి బతకడం చాలా కష్టం. ఎబోలా వైరస్ ఫిలో వైరస్ కుటుంబానికి చెందినది. ఇప్పుడిదే కుటుంబానికి చెందిన మరో వైరస్ పుట్టుకొచ్చింది. పేరు మార్బర్గ్ వైరస్. ఇది కూడా ఎబోలా లాగే ప్రాణాంతకమైనది. ఒక పక్క కరోనాతో ప్రపంచం విలవిలలాడిపోతుంటే మరో పక్క ఈ కొత్త వైరస్ ఆఫ్రికన్ దేశాలను వణికిస్తోంది. ఘనా దేశంలో పుట్టిన వైరస్ ఎన్ని దేశాలకు పాకుతుందోనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కలవరపడుతోంది. ఘనా దేశంలో ఇప్పటికే ఇద్దరి ప్రాణాలు తీసింది ఈ వైరస్.ఈ వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందో భారీగా ప్రాణనష్టం తప్పకపోవచ్చు.
అప్పట్లోనే 31 మందికి...
మార్బర్గ్ ను 1967లోనే కనిపెట్టారు. అప్పట్లో ఉగాండా నుంచి సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌కు పరిశోధనల నిమిత్తం ఆఫ్రికన్ గ్రీన్ కోతులను తీసుకువచ్చారు. ల్యాబుల్లో పరీక్షలు చేస్తున్న సమయంలో అక్కడ పనిచేస్తున్న 31 మందికి తొలిసారి మార్బర్డ్ వైరస్ సోకినట్టు గుర్తించారు. వారికి చికిత్స చేసిన వైద్యులకు, వైద్యుల ద్వారా వారి కుటుంబసభ్యులకు కూడా వైరస్ సోకింది. ఏడుగురు మరణించినట్టు కూడా నివేదికలు చెబుతున్నాయి.
గబ్బిలాల నుంచే...
ఎన్నో వైరస్‌ల వ్యాప్తికి గబ్బిలాలే కారణం అవుతున్నాయి. ఇప్పుడు మార్బర్గ్ వైరస్ వ్యాప్తికి కూడా గబ్బిలాలే కారణమని తేల్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అందులోనూ ఆఫ్రికన్ ఫ్రూట్ జాతికి చెందిన గబ్బిలాల నుంచే మనుషులకు ఈ వైరస్ సోకినట్టు డబ్య్లూహెచ్‌వో తెలిపింది. అయితే ఈ వైరస్ తనలో మోసుకెళ్తున్న గబ్బిలాలకు మాత్రం ఎలాంటి జబ్బు లక్షణాలు కలగవు, కనిపించవు. అదే మనుషులకు సోకితే మాత్రం మరణం అంచులకు తీసుకెళ్తుంది ఈ వైరస్. 2008లో ఉగాండాలో పర్యటించిన ఇద్దరు పర్యాటకుల్ల కూడా మార్బర్గ్ వైరస్ లక్షణాలు కనిపించాయి. ఆ తరువాత మళ్లీ దీని జాడ లేదు.
ఇప్పుడు ఎలా...
ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఈ వైరస్ ప్రజలకు సోకడం, ప్రాణాలు తీయడం కలవరానికి గురిచేస్తోంది. మనుషుల నుంచి మనుషులకు కూడా ఈ వైరస్ సోకుతుంది. మాట్లాడుతున్నప్పుడు నీటి తుంపర్లు, వారి రక్తం ద్వారా ఎదుటి మనిషికి సోకుతుందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెబుతోంది. అలాగే వైరస్ సోకిన వ్యక్తి యూరిన్, ఉమ్ము, చెమట, తల్లిపాలు, సెమెన్ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ వైరస్ సోకాక రెండు రోజుల నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి.
చికిత్స లేదు
కొన్ని రకాల టెస్టుల ద్వారా మార్బర్గ్ వైరస్ ను నిర్ధారిస్తారు. ప్రస్తుతానికి ఈ వైరస్ కు ఎలాంటి చికిత్ లేదు. వ్యాక్సిన్లు కూడా అందుబాటులో లేవు. అందుకే ఈ వైరస్ వస్తే బతకడం కష్టంగా మారుతుంది.