నెలలో మూడు రోజులు స్త్రీలకు ఇబ్బందిగానే ఉంటుంది. పీరియడ్స్ నొప్పులు భరించాలి. కొందరిలో వికారంగా ఉంటుంది. కాళ్లు లాగడం, ఆహారం తినాలనిపించకపోవడం, విపరీతంగా కోపం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఆ మూడు రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పీరియడ్స్ సుఖాంతమవుతాయి. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టాలి. ఆ సమయంలో హార్మోన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అందుకే భావోద్వేగాలు కూడా రోలర్ కోస్టర్ లా అనిపిస్తాయి. అందుకే ఆ సమయంలో చిరాకులు పరాకులు ఎక్కువవుతుంటాయి. కొన్ని రకాల ఆహారాలు ఈ లక్షణానలు తగ్గిస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, మనసు ప్రశాతంగా ఉండేందుకు ఈ ఆహారాలు సహాయపడతాయి. పీరియడ్స్ మూడు రోజుల్లో ఎలాంటి ఆహారాలు తినాలో ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 


తియ్యటి పండ్లు
కొన్ని పండ్లు పుల్లగా ఉంటాయి, అలాంటి పండ్లు తినకుండా తీపిగా ఉండే పండ్లను ఆ మూడు రోజుల్లో తరచూ తింటూ ఉండాలి. రుతుస్రావ సమయంలో చాలా మందికి తీపి పదార్థాలు తినాలనిపిస్తుంది. అప్పుడు చాక్లెట్ బార్ తీసుకుని తినేస్తారు. కానీ దాని కన్నా పుచ్చకాయ, రేగు పండ్లు, చెర్రీలు, ద్రాక్షలు, అరటి పండ్లు వంటి సహజ చక్కెరలు ఉన్న పండ్లను ఎంచుకుని తినాలి. ఈ పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.


ఆకుపచ్చటి కూరగాయలు
ఆ మూడు రోజుల్లో మైకంగా, అలసటగా అనిపిస్తుంది. వాటి నుంచి బయటపడాలంటే ఫైబర్, ఇనుము అధికంగా ఉండే ఆహారాలను తినాలి. ముఖ్యంగా పాలకూర, బచ్చలికూర, బ్రకోలీ, పచ్చి బఠాణీలు వంటివి మెనూలో చేర్చుకోవాలి. మొలకలు, కాలీ ఫ్లవర్, క్యారెట్ వంటి కూరగాయల్లో కూడా ఫైబర్ నిండుగా ఉంటుంది. ఇవి మైకాన్ని తగ్గించి అలసట రాకుండా చూస్తాయి. 


టీలు
టీలలో చాలా రకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పుదీనా టీ, అల్లం టీ, చామంతి పూల టీ వంటివి తాగితే పొత్తకడుపు నొప్పి తగ్గుతుంది. వికారం వంటి లక్షణాలు కూడా తగ్గుతాయి. నరాలు, కండరాలకు కూడా విశ్రాంతినిస్తుంది. ఒత్తిడి స్థాయిలను కూడా తగ్గించడంలో ఈ టీలు ముందుంటాయి. 


చికెన్, చేపలు
చేపలు, చికెన్.. ఈ రెండింటిలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. రుతుస్రావం సమయంలో రక్తం బయటికిపోతుంది కాబట్టి ఇనుము స్థాయిలు కూడా శరీరంలో తగ్గుతాయి. కాబట్టి చికెన్, చేపలు తినడం వల్ల మేలు జరుగుతుంది. చేపలలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అవి పీరియడ్స్ నొప్పులను తగ్గిస్తాయి. 


నీరు అధికంగా...
ఆ మూడురోజులు దాహం వేసినా, వేయకపోయినా నీళ్లు అధికంగా తాగాలి. తగినంత నీరు శరీరంలో ఉంటే పొట్ట ఉబ్బరం, తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: చారు పొడి కొనుక్కుంటున్నారా? ఇలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు


Also read: ముఖంపై కనిపించే ఈ లక్షణం ఉదర క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు