Leaky Gut Syndrome: ప్రస్తుత సమాజంలో ప్రజల లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు పలు రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. చాలా మంది బలవర్థకమైన ఫుడ్ తీసుకోవడం మానేసి, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినేందుకు మొగ్గు చూపుతున్నారు. కంప్యూటర్ ముందు గంటలు గంటలు ఒళ్లు కదలకుండా పని చేస్తున్న నేపథ్యంలో శరీరానికి అవసరమైన శ్రమ లేక చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బిజీ లైఫ్, వర్క్ టెన్షన్స్, పోషకాహారలోపంతో ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన లాంటి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా జీర్ణవ్యవస్థ సైతం అనారోగ్యం పాలవుతోంది. చాలా మంది లీకీ గట్ లేదంటే పేగుపూత సహా పలు జీర్ణ సంబంధ సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో లీకీ గట్ పై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది హీరోయిన్ సమంత. తాజాగా లీకీ గట్ కు సంబంధించి ప్రోమోను షేర్ చేసింది. ఇందులో లీకీ గట్ కు సంబంధించిన ప్రశ్నలకు డాక్టర్ సమాధానాలు ఇస్తున్నారు. త్వరలోనే ఈ పూర్తి ఎపిసోడ్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.






తొలిదశలో గుర్తిస్తే నయం చేసుకునే అవకాశం


నిజానికి మనిషి శరీరంలో ప్రతి అవయవం చాలా ముఖ్యమైనదే. వాటిలో జీర్ణ వ్యవస్థ చాలా కీలకమైనది. ఆహారం తీసుకోవడం దగ్గర నుంచి మొదలుకొని అనవసర వ్యర్థాలను బయటకు పంపించే వరకు జీర్ణ వ్యవస్థ బాధ్యత వహిస్తుంది. జీర్ణ వ్యవస్థలో పేగులు అత్యంత ముఖ్యమైనవి. పేగుల ఆరోగ్యాన్ని బట్టే జీర్ణవ్యవస్థ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పేగులకు వచ్చే ప్రధాన సమస్యల్లో లీకీ గట్స్ లేదంటే పేగు పూత ప్రధానమైనది. పేగుపూత  నోటి  నుంచి మొదలుకొని మలద్వారం వరకు ఎక్కడైనా సోకే అవకాశం ఉంటుంది. తొలిదశలో గుర్తిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇంకీ ఈ లీకీ గట్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 


లీకీ గట్ కారణంగా కడుపులోని బాక్టీరియా, టాక్సిన్స్ పేగు గోడ ద్వారా కదులుతాయి.  నెమ్మదిగా పేగు వాపుకు దారితీస్తుంది. లీకీ గట్ సమస్య ఉన్నప్పుడు పేగులో మంట, అతిసారం, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం లాంటి లక్షణాలు ఏర్పడుతాయి. మోతాదుకు మించి పాలు తాగడం, మద్యం అతిగా తీసుకోవడం, చక్కెర, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల ఈ గట్ లీకేజీకి కారణమవుతుంది.


లీకీ గట్  లక్షణాలు


⦿ చాలా కాలం పాటు పొత్తి కడుపులో నొప్పి


⦿ అపెండిసైటిస్‌ లక్షణాలను కలిగి ఉండటం


⦿ దీర్ఘకాలిక విరేచనాలు


⦿ జ్వరం


⦿ బరువు తగ్గడం


⦿ మలంలో రక్తం


⦿ నోటిలో అల్సర్స్‌


గతంలో లీకీ గట్ ను వెస్ట్రన్  డిసీజ్ గా పిలిచే వారు. ఈ రుగ్మత వెస్ట్రన్ కంట్రీస్ లో మాత్రమే కనిపించేది. కానీ, గత కొంతకాలంగా భారత్ లోనూ విస్తరించింది. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.



Read Also: ఖాళీ కడుపుతో తీసుకునే ఈ డీటాక్స్ డ్రింక్ గురించి మీకు తెలుసా?