నవ్వు నాలుగు విధాలా చేటు అని మన పెద్దలు ఎందుకు అన్నారనేది.. ఈ విషయం పూర్తిగా చదివిన తర్వాత మీకే అర్థమవుతుంది. చెడు గురించి చెప్పుకొనే ముందు.. నవ్వడం వల్ల కలిగే మంచి గురించి తెలుసుకుందాం. నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిదని, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుందని కొన్ని అధ్యయనాలు చెప్పాయి. ఆందోళన, ఒత్తిడిని కూడా నవ్వు తొలగిస్తుందని పేర్కొన్నాయి. నవ్వు మహిళల్లో సంతానోత్పత్తిని పెంచుతుందట. నవ్వు.. హ్యాపీ హార్మోన్‌లను ఉత్పత్తి చేసి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అయితే, ఇప్పుడు నవ్వడం వల్ల కలిగే దుష్ప్రయోజనాలు గురించి చూద్దాం. 


దేనికైనా లిమిట్ ఉంటుంది. అది నవ్వుకు కూడా వర్తిస్తుంది. తేలికపాటి నవ్వు ఆరోగ్యానికి మంచిదే. కానీ, మితిమీరిన నవ్వు.. మాత్రం ఆరోగ్యానికి చేటు. ముఖ్యంగా చాలామంది ఇతరులను గుక్కపెట్టి నవ్వేలా చేస్తుంటారు. ఆపకుండా కితకితలు పెట్టడం, ఆపుకోలేనంతలా నవ్వించడం వంటివి చేసినప్పుడు.. ప్రాణాలు పోవచ్చని చెబుతున్నారు. నాలుగు విధాలుగా చంపేస్తుందట.  


1. శ్వాసక్రియకు ఆటంకం


గట్టిగా నవ్వడం వల్ల వల్ల శ్వాస సమస్యలు కూడా వస్తాయట. నవ్వు శ్వాసక్రియకు ఆటంకం కలిగిస్తుందట. నవ్వేప్పుడు మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. అయితే, ఈ కారణంతో నమోదైన మరణాల సంఖ్య చాలా తక్కువని గణంకాలు చెబుతున్నాయి. USలోని లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పిక్సియేషన్ లేదా కార్డియాక్ అరెస్ట్ కారణంగా నవ్వుతో మరణించిన వారి కేసులు కొన్ని నమోదయ్యాయని, అవి చాలా అరుదుగా నమోదయ్యే మరణాలని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఇది పెద్ద సమస్య కాదన్నారు. రక్తనాళాల సమస్య, మూర్ఛ, అనూరిజం సమస్యలతో బాధపడేవారికే ఎక్కువ ముప్పని చెబుతున్నారు. 


2. మెదడు ‘అనూరిజం’కు గురవ్వుతుంది


‘అనూరిజం’ అంటే రక్తనాళాలు బలహీనం కావడం. రక్తనాళాల్లో అసాధారణ వాపు ఏర్పడినప్పుడు అవి ఉబ్బిపోయి చిట్లిపోతాయి. ఫలితంగా బాధితులు చనిపోయే ప్రమాదం ఉంది. గట్టిగా నవ్వినప్పడు రక్తనాళాలపై ఒత్తిడి ఏర్పడి పగిలిపోయే ప్రమాదం ఉంది. అయితే, మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నవ్వడం వల్ల అనూరిజం రాదు. అప్పటికే రక్తనాళాలతో సమస్యతో బాధపడేవారిలో ‘అనూరిజం’ ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నట్లు బాధితులకు అస్సలు తెలియదు. అలాంటి వ్యక్తులు గట్టిగా నవ్వినప్పుడు ‘అనూరిజం’ పగిలిపోతుంది.  


3. మూర్ఛ


కొందరు తమ నవ్వును అస్సలు నియంత్రించుకోలేరు. అది జిలాస్టిక్ ఎపిలెప్సీకి దారితీయొచ్చు. దానివల్ల మూర్ఛపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి ఏర్పడటానికి కారణం  హైపోథాలమస్‌లోని చిన్న కణితి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. 


4. ఆస్తమా 


విపరీతమైన నవ్వు లేదా తీవ్రమైన ఏడుపు వంటి తీవ్ర భావోద్వేగ పరిస్థితులు ఆస్తమాకు గురిచేస్తాయి. మనం భావోద్వేగాలకు గురైనప్పుడు శ్వాసించే విధానం మారుతుందట. ఉదాహారణకు ఏడుపు వచ్చినప్పుడు శ్వాసను నియంత్రించుకొనే ప్రయత్నం చేస్తుంటాం. లోతైన శ్వాస తీసుకుంటాం. దీన్నే హైపర్‌వెంటిలేటింగ్ అంటారు. ఇది మీ వాయు మార్గాలను ఇరుకుగా మారుస్తాయి. ఫలితంగా ఛాతి బిగువుగా మారుతుంది. దగ్గు, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలతో బాధపడతారు. 2009లో జరిగిన అధ్యయనం ప్రకారం.. ఆస్తమాతో బాధపడుతున్న 105 మంది రోగుల్లో 40 శాతం మంది కంటే ఎక్కువ మంది నవ్వు వల్ల ఆస్తమాకు గురైనట్లు తేలింది. ఆస్తమాతో బాధపడేవారు గట్టిగా నవ్వితే ప్రాణాలకే ప్రమాదం. 


Also Read: చలికాలంలో ముద్దులు పెట్టుకోవచ్చా? రోగనిరోధక శక్తికి, ముద్దుకు లింకేమిటీ?