గతంలో అయితే ధూమపానం చేసే వారికి ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చేది. కానీ ఇప్పుడు పొగతాగే అలవాటు లేని వారికి కూడా ఈ ప్రాణాంతక వ్యాధి వస్తుంది. శ్వాసకోశ వ్యవస్థ కీలక అవయవంలో కణితి ఏర్పడటం వల్ల దాని సాధారణ పనితీరు అడ్డుకుంటుంది. ఇది ధూమపానం చేసే వ్యక్తుల్లో సర్వసాధారణంగా అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో ఈ క్యాన్సర్ నాలుగో స్థానంలో ఉంది. థొరాసిక్ ఆంకాలజీ జర్నల్‌లోని ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల రేటు 8.1 శాతం.


ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. ప్రాథమిక దశలోని లక్షణాలు, సంకేతాలు గుర్తించి సరైన సమయానికి చికిత్స తీసుకుంటే ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ వాటిని విస్మరిస్తే మాత్రం వ్యాధి ముదిరిపోయి ప్రాణాలు తీస్తోంది. అందుకే ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం.


ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణాలు ఏమిటి?


ఊపిరితిత్తుల క్యాన్సర్ ధూమపానం వల్ల అభివృద్ధి చెందుతుంది. కానీ వాటితో పాటి ఇతర కారణాలు కూడా ఉంటాయి.


⦿ విష రసాయనాలు పీల్చడం


⦿ వాయు కాలుష్యం


⦿ కుటుంబంలో ఎవరికైనా గతంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ చరిత్ర ఉండటం 


⦿ రేడియేషన్ థెరపీ చరిత్ర


⦿ రాడాన్ గ్యాస్ ఎక్కువగా పీల్చడం


⦿ పారిశ్రామిక ప్రాంతాల్లో నివసించడం లేదా పని చేయడం


⦿ ఈ సిగరెట్లు తాగడం


ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల సమస్యలు


ముందుగా ఈ క్యాన్సర్ ని నివారించాలి అనుకుంటే ధూమపానం నుంచి దూరంగా ఉండాలి. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే అనేక సమస్యలు శరీరం మీద దాడి చేస్తాయి. అవేంటంటే..


☀ ఛాతీ నొప్పి


☀ ఛాతీ బిగుతుగా పట్టేసినట్టు అనిపించడం


☀ దగ్గుతున్నప్పుడు రక్తం పడటం


☀ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది


☀ గుండెకి ద్రవాలు చేరడం


☀ కొన్ని సందర్భాల్లో న్యుమోనియా


ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రాథమిక సంకేతాలు?


ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రాథమిక సంకేతాలు గుర్తించడం చాలా ముఖ్యం. ఇవి కనిపించగానే వెంటనే చికిత్స తీసుకుంటే నివారణ సులభం అవుతుంది.


☀ ఛాతీ నొప్పి


☀ అకస్మాత్తుగా బరువు తగ్గడం


☀ గురక


☀ తలనొప్పి


☀ ఎముకల నొప్పి


☀ శ్వాస ఆడకపోవడం


☀ గొంతు బొంగురుపోవడం


☀ విపరీతమైన అలసట


☀ దీర్ఘకాలం పాటు దగ్గు రావడం


ప్రాథమిక లక్షణాలు గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. కణితి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి దాన్ని తొలగించేందుకు శస్త్ర చికిత్స చేసే అవకాశం ఉంది. కణితిలోని ద్రవం ఇతర అవయవాలకి వ్యాపిస్తే మాత్రం అది తీవ్రమైన వ్యాధిగా మారుతుంది. రేడియేషన్ థెరపీ లేదా కీమో థెరపీ చేసి నయం చేసేందుకు ప్రయత్నిస్తారు. రోగి ఆరోగ్య పరిస్థితి, వ్యాధి దశని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ధూమపానం వదిలేయడం అన్నింటి కంటే మంచి మార్గం. వాటితో పాటు పోషకాలు నిండిన సమతుల్య ఆహారం తీసుకోవాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: బరువు తగ్గి, సన్నబడేందుకు ఈ డైట్ పాటిస్తున్నారా? మీరు డేంజర్లో పడినట్లే!