ఊబకాయం వస్తే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. బరువు తగ్గడం కోసం ఆహారం విషయంలో చాలా పొదుపు పాటిస్తారు. అందుకోసం చాలా మంది ఎంచుకునే డైట్ ఫాడ్ డైట్. ఇది పాటించడం వల్ల నాజూకుగా, అందంగా కనిపిస్తారు. వాస్తవానికి అది మిమ్మల్ని దీర్ఘకాలంలో అనారోగ్యానికి గురి చేస్తుంది. స్వల్పకాలిక సంతోషం అందించే ఈ జీవనశైలి కారణంగా సమతుల్య ఆహరం తీసుకోలేరు. దాని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందటం కష్టమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, అధిక బరువు అనేక ఆరోగ్య ప్రమాదాలని తీసుకొస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు వంటి ప్రమాదకరమైన, ప్రాణాంతక పరిస్థితులకి దారి తీస్తుంది. అయితే, బరువు నుంచి బయటపడేందుకు ఫాడ్ డైట్ ఒక్కటే మార్గం కాదు. ఆరోగ్యకరమైన విధానాలు ఇంకా చాలానే ఉన్నాయ్.
ఫాడ్ డైట్ అంటే ఏంటి?
క్లీవ్ ల్యాండ్ క్లినిక్ ప్రకారం ఫాడ్ డైట్ త్వరగా బరువు తగ్గడానికి ఉత్తమమైన ప్రణాళిక. అయితే ఈ డైట్ వల్ల శరీరానికి అవసరమైన అవయవాలు ఆరోగ్యంగా పని చేయడానికి అవసరమైన పోషకాలని తీసుకోవడం పరిమితం చేస్తుంది. దీని వల్ల ఆరోగ్యానికి అవసరమైన లెక్టిన్ వంటి పోషకాహార వనరులు అందవు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. ఈ ఫాడ్ డైట్ ఒక్కసారిగా ఆపేస్తే బరువు త్వరగా పెరిగిపోతారు. కొన్నిసార్లు గతంలో ఉన్న బరువు కంటే ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఫాడ్ డైట్‌లో శరీరానికి కావాల్సిన కొన్ని ముఖ్యమైన ఆహారాలు తొలగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
ఫాడ్ డైట్ వల్ల వచ్చే సమస్యలు
⦿ డీహైడ్రేషన్
⦿ బలహీనత, అలసట
⦿ వికారం, మైకం
⦿ తలనొప్పి
⦿ మలబద్దకం
⦿ విటమిన్లు, పోషకాల లోపం
ఎక్కువ మంది పాటించే కొన్ని ఫాడ్ డైట్స్ ఇవి
అట్కిన్స్ డైట్: ఇది తక్కువ కార్బ్ డైట్. నాలుగు దశలుగా ఉంటుంది. దీనిలో అపరిమిత మొత్తంలో ప్రోటీన్, కొవ్వును తీసుకోవచ్చు. బరువు తగ్గే లక్ష్యాన్ని సాధించడం కోసం ఎక్కువ మంది దీన్ని ఎంచుకుంటారు. అయితే దీని వల్ల విటమిన్ల లోపం తలెత్తే ప్రమాదం ఉంది. పిండి పదార్థాలు కాకుండా ఎక్కువగా మొక్కల ఆధారిత పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. అటువంటి సమయంలో శరీరానికి కావాల్సిన పిండి పదార్థాలు అందవు కాబట్టి పోషకాహార లోపం తలెత్తి ఇతర సమస్యలకి దారితీస్తుంది.
కీటో డైట్: ప్రపంచంలోనే బరువు తగ్గించుకోడం కోసం ఎక్కువ మంది అనుసరించే విధానం ఇది. తక్కువ కార్బ్, ప్రోటీన్స్ మితంగా తీసుకోవడం, అధిక మొత్తంలో కొవ్వుని తీసుకుంటారు. కార్బోహైడ్రేట్లు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. కానీ కీటో డైట్ వల్ల అది సాధ్యపడదు. ఇవి తక్కువగా అందటం వల్ల దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల శరీరానికి తగినంత పోషకాలు అందవు.
వేగన్ డైట్: ఇప్పుడు అందరూ వేగన్లగా మారేందుకు ట్రై చేస్తున్నారు. వీళ్ళు కేవలం మొక్కల నుంచి వచ్చే ఆహారపదార్థాలు మాత్రమే తీసుకుంటారు. శాఖాహారాన్ని అనుసరిస్తారు. జంతువుల నుంచి తయారయ్యే ఏ ఉత్పత్తిని వీళ్ళు ముట్టుకోరు. కనీసం పాలు, పెరుగు, నెయ్యి వంటివి కూడా తీసుకోరు. అయితే దీని వల్ల విటమిన్ బి 12 లోపం వస్తుంది. ఇది నరాలని తీవ్రంగా దెబ్బతీస్తుంది.
పాలియో డైట్: పూర్వీకుల నుంచి వస్తున్న డైట్ ఇది. పాలు, కాయధాన్యం, ధాన్యాలు వంటి అనేక ఆహారాలని తీసుకోవడం పరిమితం చేస్తుంది. పండ్లు, కూరగాయలు, పాలని మాత్రమే తీసుకుంటారు. ఇది కిడ్నీ, గుండె జబ్బుల ముప్పులు పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: మీ మంచం మీద బెడ్‌షీట్స్‌ను ఉతకడం లేదా? జాగ్రత్త, ఈ భయానక వ్యాధి సోకవచ్చు!