Knee Pain Relief : వయసు పెరిగేకొద్దీ మోకాళ్ల నొప్పి చాలామందిని వేధిస్తుంటుంది. అయితే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, గాయాలు, సరికాని భంగిమల్లో ఎక్కువసేపు ఉండటం వంటి కారణాలతో మోకాళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. రోజంతా పని చేసిన తర్వాత రాత్రి పడుకునే సమయంలో మోకాళ్లు నొప్పిగా అనిపిస్తే నిద్ర కూడా సరిగా పట్టదు. ఆ సమయంలో చాలామంది కొన్ని ఇంటి చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. వాటిలో మోకాళ్లకు పసుపు రాయడం కూడా ఒకటి.

Continues below advertisement

మోకాలి నొప్పికి పసుపు రాస్తే తగ్గుతుందా?

పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే పసుపును వాపు, నొప్పి తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తుంటారు. అయితే మోకాలి నొప్పి ఉన్న ప్రాంతంలో పసుపు బయట నుంచి రాసుకోవడం వల్ల కీళ్ల నొప్పి తగ్గుతుందని చెప్పే శాస్త్రీయ ఆధారాలు లేవు. ఎందుకంటే ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలకు పసుపు రాసుకోవడం చికిత్స కాదు. కానీ పసుపు రాసుకున్న తర్వాత కొంతమందికి వేడి లేదా మసాజ్ వల్ల తాత్కాలికంగా ఉపశమనం అనిపించవచ్చు. 

Also Read : మోకాళ్ల నొప్పులతో నడవలేకపోతున్నారా? నొప్పి లేకుండా వాకింగ్ చేయడానికి చిట్కాలు పాటించండి

Continues below advertisement

మరి ఇంట్లోనే మోకాలి నొప్పిని ఎలా తగ్గించుకోవాలి?

మీకు మోకాలి నొప్పి స్వల్పంగా ఉండి.. తీవ్రమైన గాయం లేకపోతే కొన్ని సింపుల్ చిట్కాలు ఉపశమనం కలిగిస్తాయని చెప్తున్నారు. అదే వేడి నీళ్లతో కాపడం పెట్టడం. ఉదయం లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు మోకాళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తే దీనిని ట్రై చేయవచ్చు. మోకాలి దగ్గర గాయం తర్వాత వాపు లేదా నొప్పి వస్తే హీట్ ప్యాక్ కాకుండా కోల్డ్ ప్యాక్ పెడితే మంచిది. అయితే ఐస్‌ను నేరుగా చర్మంపై అప్లై చేయకుండా గుడ్డలో చుట్టి అప్లై చేస్తే రిలీఫ్ ఉంటుంది. 

మోకాలి నొప్పి ఉందని రోజంతా బెడ్‌పై పడుకోవడం కరెక్ట్ కాదు. ఎక్కువసేపు కదలకుండా ఉండటం వల్ల కీళ్లలో గట్టిదనం మరింత పెరగొచ్చు. నొప్పి భరించగల స్థాయిలో ఉంటే చిన్నగా నడవడం, సింపుల్ స్ట్రెచింగ్ చేయడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. అయితే నొప్పి పెరిగితే వ్యాయామాన్ని ఆపాలి. అధిక బరువు మోకాళ్లపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఆఫీస్‌లో గంటల తరబడి ఒకే పొజిషన్‌లో కూర్చోవడం, టీవీ చూస్తూ లేదా ఫోన్ చూస్తూ కాళ్లను కదపకుండా ఉండటం మంచిది కాదు. 

Also Read : చలికాలంలో ఈ సింపుల్​ వ్యాయామాలతో మోకాళ్ల నొప్పులు దూరం చేసుకోవచ్చు

రాత్రి పడుకునేప్పుడు.. 

పడుకునేటప్పుడు మోకాళ్ల మధ్య లేదా కాళ్ల కింద చిన్న దిండు పెట్టుకోవడం సౌకర్యంగా ఉంటుంది. అలాగే మంచంపై పడుకుని.. గోడకు దగ్గరగా జరిగి.. గోడకు కాళ్లు ఆన్చి కాసేపు ఉంటే కూడా మంచిదే. చివరిగా మోకాలి నొప్పి ఎక్కువగా ఉంటే ఈ ఇంటి చిట్కాలు కూడా మీకు ఉపశమనం ఇవ్వకుంటే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి. అలాగే అసలు కారణం ఏంటో గుర్తించి దానికి తగ్గట్లు జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటే మంచిది. 

Also Read : మోకాలి మార్పిడి చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి