ఓ వ్యక్తికి పొదల్లో ఓ సింహం కనిపించింది. దీంతో అతడి కాళ్లు గజగజ వణికిపోయాయి. అటుగా వచ్చేవాళ్లను కూడా అప్రమత్తం చేసి.. దగ్గరకు వెళ్లొద్దని చెప్పాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన అక్కడికి చేరిన అధికారులు కూడా పొదల్లో నుంచి నక్కి నక్కి చూస్తున్న సింహాన్ని చూశారు. అది అక్కడి నుంచి కదలకుండా జనాలు చేస్తున్న హడావిడి అంతా చూస్తోంది. కనీసం రెప్ప కూడా వేయడం లేదు. దాన్ని పట్టుకోడానికి వచ్చిన సిబ్బంది కూడా దాని దగ్గరకు వెళ్లే సాహసం చేయలేదు. కొన్ని నిమిషాల తర్వాత వారు ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒట్టి చేతులతోనే దాన్ని సమీపించారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మీరు ఊహించలేరు. కెన్యాలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలిసి నెటిజనులు పగలబడి నవ్వుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
మౌంట్ కెన్యా నేషనల్ పార్క్‌కు సుమారు ఓ కిలోమీటరు దూరంలో ఓ రైతుకు పొదల్లో సింహం కనిపించింది. దీంతో అతడు అధికారులకు ఫిర్యాదు చేసి అప్రమత్తం చేశాడు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సింహాన్ని పట్టుకోడానికి సిద్ధమయ్యారు. అయితే, అది ఎంతకీ కదలకపోవడంతో దగ్గరకు వెళ్లి చూసి షాకయ్యారు.
ఇంతకీ అది సింహం కాదు. సింహం ఫొటో ప్రింట్ చేసివున్న బ్యాగ్. ఈ ఘటనపై ‘కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్’ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తే ఆ బ్యాగ్ అక్కడ పెట్టాడని తెలిసింది. అవకాడో మొక్కలు ఎండ వేడికి మాడిపోతాయనే ఉద్దేశంతో ఆ బ్యాగ్‌లో వేసి పొదల్లో పెట్టాడు.
ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉండటంలో తప్పులేదు. ఒక వేళ అక్కడ నిజంగానే సింహం ఉన్నట్లయితే పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. నేషనల్ పార్క్ కూడా ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉంది. మన ఇండియాలో కూడా ఒక్కోసారి పులులు జనావాసాల్లోకి వస్తుంటాయి. ఇటీవల ఓ ఫారెస్ట్ అధికారి పోస్ట్ చేసిన వీడియో చూస్తే వణికిపోతారు.
జనవాసాల్లోకి వచ్చిన ఓ పులి ఇంటి గేటు ముందుకు వచ్చి ఆహారం కోసం వెతకసాగింది. దానికి ఆ ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క కనిపించింది. అంతే.. అమాంతంగా గేటు దూకేసింది. దాన్ని చూడగానే కుక్క పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ, అప్పటికే ఆలస్యమైంది. పులి.. దాని పీకను నోటితో పట్టుకుని గోడ దూకి తీసుకెళ్లిపోయింది. పులి నుంచి తమ యజమానిని కాపాడే క్రమంలో ఆ కుక్క ప్రాణాలు కోల్పోయింది.
Also Read: భూమి తిరగడం ఆగిపోతే అంత భయానకంగా ఉంటుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన ఖగోళ శాస్త్రవేత్త