జెర్సీ అనగానే అందరికీ గుర్తొచ్చేది నాని సినిమా లేదా క్రికెటర్లు వేసుకునే టీషర్టు. ఆ రెండే ఈ పేరుతో బాగా ఫేమస్ అయ్యాయి. కానీ వీటన్నింటికన్నా ముందు నుంచే ఓ జబ్బు ఇదే పేరుతో ఉంది. ఆ జబ్బు ‘జెర్సీ ఫింగర్’. దీని పేరుకి, ఆటకు కనిపించని సంబంధం ఉన్నట్టే,ఈ జబ్బుకు కూడా ఆటలతో సంబంధం ఉంది. ఫుట్ బాల్, కబడ్డీ, వాలీబాల్ లాంటి ఆటల్లో ప్రత్యర్థులను ఆపేందుకు ఆటగాళ్లు చాలా ప్రయత్నిస్తుంటారు. వారు వేసుకున్న జెర్సీని పట్టుకుని లాగేస్తుంటారు. అందుకోసం చేతులను, కండరాలను బలంగా ఉపయోగిస్తారు. ఏదైనా పట్టుకోవడానికి చేతివేళ్లలోని టెండన్స్ అనే భాగాలు సహకరిస్తాయి. ఇవి ఎముకలను, కండరాలను కలిపేవి. వేళ్లల్లో అనేక టెంటన్లు ఉంటాయి. వాటిలో ప్రధానమైనది ‘ఫ్లెక్సార్ టెండన్’. ఆటలో కొన్నిసార్లు చేతి వేళ్లు గాయపడుతుంటాయి. ఆ సమయంలో లోపలున్న ఈ ప్లెక్సార్ టెండన్ కూడా గాయపడుతుంది.
ఇలా ప్లెక్సార్ టెండన్ కు దెబ్బతగలడం వల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది. నొప్పి చేతివేళ్లలో కలగచ్చు లేదా మణికట్టు,అరచేయి మధ్యలో కూడా కలగచ్చు. ఆ నొప్పినే ‘జెర్సీ ఫింగర్’ అంటారు. దీని వల్ల చేతి వేళ్లు కదల్చలేరు, ముట్టుకున్నా కూడా విపరీతమైన నొప్పి వస్తుంది. ఎక్కువగా ఆటగాళ్లకే ఇది వస్తుంది.
చికిత్స సాధారణమే
నొప్పి తగ్గేందుకు మందు సూచిస్తారు వైద్యులు. మూడు నాలుగు రోజులకు నొప్పి తగ్గుముఖం పడుతుంది. అలా తగ్గకుండా సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం ఫ్లెక్సార్ టెండన్ గాయపడిన ప్రదేశంలో చిన్న ఆపరేషన్ చేస్తారు. ఫ్లెక్సార్ టెండర్ తిరిగి ఎముకను, కండరాన్ని అతుక్కుంటుంది. ఇందుకు కొన్ని రోజులు సమయం పడుతుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.