యువతీ యువకులే టార్గెట్, వారు ప్రేమలో పడాలి, పెళ్లి చేసుకుంటారో లేదో వారిష్టం. పిల్లల్ని మాత్రం కనాలి, దేశం జనాభా పెంచాలి. ఇది జపాన్లోని ఓ నగరంలో ప్రవేశపెట్టిన కొత్త స్కీమ్ వివరాలు. ఆన్‌లైన్ డేటింగ్, యాప్ కల్చర్ కొనసాగుతున్న కాలంలో పాత పద్ధతైన ప్రేమలేఖలను ప్రవేశ పెట్టడం అక్కడి ప్రజలను బాగా ఆకర్షితులను చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రేమలేఖల డబ్బాను కూడా ఏర్పాటు చేశారు. జపాన్లోని మియాజాకి అనే నగరంలో ఈ మ్యాచ్ మేకింగ్ పథకం కొనసాగుతోంది. నగరంలోని యువతీ యువకులు తమకు నచ్చినవారికి లేఖలు రాసి, వారిచ్చే రిప్లయ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ఫీలింగ్ ను వారు కొత్తగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఈ స్కీమ్ విజయవంతమైంది. 


జనాభాను పెంచాలనే...
ఈ మ్యాచ్ మేకింగ్ స్కీమ్ ద్వారా జననరేటును పెంచాలన్నది స్థానిక అధికారుల ప్రయత్నం. వీరికి కచ్చితంగా వివాహం చేసుకోవాలన్న నియమం పెట్టలేదు. ఈ పద్ధతిలో ఇప్పటికే 17 జంటలు ఏర్పడ్డాయని, వారు ప్రస్తుతం డేటింగ్లో ఉన్నారని చెబుతున్నారు అధికారులు. ఈ స్కీమ్ ఇప్పటిది కాదు, మొదలుపెట్టి రెండేళ్లు అయింది. కానీ ఇప్పుడిప్పుడే ఇది జోరందుకుంది. 


ఇది కాస్త డిఫరెంట్...
ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్న అధికారి రీ మియాటా. ఆమె మాట్లాడుతూ ‘డేటింగ్ యాప్స్‌తో పోలిస్తే ఇది కాస్త నెమ్మదిగా సాగే ప్రక్రియ. కానీ  మీరు గురించి మీరు ఓపికగా ఎదుటివారికి చెప్పగలరు. వారిపై ఉన్న ప్రేమను వ్యక్తపరచగలరు. ఎదురుగా కూర్చున్నప్పుడు తొలిసారి అన్ని విషయాలు ధైర్యంగా మాట్లాడలేం. అదే ఉత్తరం ద్వారా ఎలాంటి సందేహం లేకుండా అన్ని విషయాలు పంచుకోవచ్చు. మీ రచనా నైపుణ్యం వారిని ఇంప్రెస్ కూడా చేసే అవకాశం ఉంది. ప్రేమ నిండిన అక్షరాలకుండే శక్తి అధికం’ అన్నారామె. 


షరతులు వర్తిస్తాయి...
అయితే ఉత్తరాలలో పేరు, చిరునామాలు ఉండకూడదు. అలా అయిదు ఉత్తరాలు రాసుకోవచ్చు.కోడ్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అయిదు ఉత్తరాలు అందుకున్నాక వారు ఒకరినొకరు చూడాలనుకుంటే, నేరుగా కలవాలనుకుంటే స్కీమ్ అమలు చేస్తున్న అధికారులే ఏర్పాట్లు చేస్తారు. నేను కలిశాక వారికి ఇంకా ప్రేమ పెరిగితే అది బంధంగా మారే అవకాశం ఉంది. 





Also read: ఆ హీరో కాలివేళ్లు తొలగించడానికి కారణం డయాబెటిసే, ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడండి


Also read: మహిళలూ జాగ్రత్త, నలభై ఏళ్లు దాటితే కచ్చితంగా రొమ్ము క్యాన్సర్ చెక్ చేసుకోవాల్సిందే