ప్రశాంతంగా నిద్రపోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా గురక సమస్యతో బాధపడుతున్న పార్టనర్‌కు ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. గురక పెట్టే వ్యక్తి హాయిగా బాగానే నిద్రిస్తాడు. కానీ, పక్కన నిద్రపోయేవారికే చుక్కలు కనిపిస్తాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత ‘‘నీ గురక వల్ల నాకు నిద్ర పట్టలేదు’’ అని చెప్పినా.. కొందరు బుకాయిస్తారు. తనకు అసలు గురకే రాదని వాదిస్తారు. కొందరైతే నిజాన్ని అంగీకరించి.. దాన్ని కంట్రోల్ చేసుకొనే చిట్కాలు లేదా చికిత్స కోసం ప్రయత్నిస్తారు. అన్నట్టు.. గురక సమస్య మీకు కూడా ఉందా? అయితే, సింపుల్‌గా ఈ రెండు చిట్కాలు ప్రయత్నించి చూడండి. మొదటి చిట్కా కాస్త సులభమైనదే. కానీ, రెండో చిట్కా అమలు చేయడం మాత్రం కష్టమే. 


వాస్తవానికి గురకను కంట్రోల్ చేయడానికి ప్రపంచంలో 54 శాతం మంది ఏదో ఒక చిట్కా పాటిస్తూనే ఉంటారట. తాజా అధ్యయనంలో నాసల్ స్ట్రిప్స్, డైలేటర్స్, స్ప్రే, వేడినీటి స్నానం వంటి చిట్కాలు మొదటి ముఫ్పై చిట్కాల్లో ముందున్నాయట. అయితే, వీటిలో రెండు చిట్కాలు బాగా పనిచేస్తున్నట్లు తేలింది. అవి ఇవే...


1. నీరు తాగాలట: నిద్రపోయే సమయంలో నీళ్ల బాటిల్ మంచం దగ్గర పెట్టుకుని తరచుగా నీళ్లు తాగుతూ ఉంటే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. దానివల్ల గురక కూడా పెద్దగా రాదట. 


2. టెన్నిస్ బాల్‌తో ఇలా..: సాధారణంగా వెల్లకిలా నిద్రపోయేవారే ఎక్కువగా గురక పెడతారట. అందుకే, కొంతమంది టెన్నిస్ బాల్ చిట్కాను పాటిస్తున్నారు. నిద్రపోవడానికి ముందు ఒక టెన్నిస్ బాల్ తీసుకుని మంచంపై పెట్టుకోండి. మీకు సౌకర్యంగా ఉండేలా ఒక పక్కకు తిరిగి పడుకోండి. రెండో పక్క నడుముకు దగ్గరగా టెన్నిస్ బాల్ పెట్టుకోండి. ఒక వేళ మీరు వెల్లకిలా పడుకోవాలని అనుకున్నా.. పడుకోలేరు. టెన్నిస్ బాల్ ఉండటం వల్ల పక్కకు తిరిగి పడుకుంటారు. దానివల్ల గురక కూడా కంట్రోల్ అవుతుందట. 


ఇవి కూడా ట్రై చేయండి


⦿ ఒక అధ్యయనం ప్రకారం.. కొంత మంది గురుకను నివారించేందుకు పడుకునే ముందు మద్యానికి దూరంగా ఉంటారు. వీరు తొమ్మిది శాతం వరకు ఉండొచ్చు. 
⦿ గురక వస్తుందనే కారణం వల్ల మద్యానికి మొత్తానికే దూరంగా ఉండే వారు ఒక ఎనిమిది శాతం వరకు ఉంటారు. 
⦿ ఎక్స్ ట్రా దిండ్లు ఉపయోగించడం, హూమిడిఫైయర్లతో ఎయిర్వేస్ తెరుచుకునేట్టు చెయ్యడం వంటివి గురక తగ్గేందుకు ఉపయోగపడతాయట.
⦿ ఆల్కహాల్ పరిమితికి లోబడి తీసుకోవడం, కుదిరితే పూర్తిగా మానెయ్యడం
⦿ వెల్లకిలా పడుకోకుండా ఒక పక్కకు తిరిగి పడుకోవడం
⦿ శరీర బరువు తప్పకుండా అదుపులో ఉంచుకోవడం
⦿ సమస్య తీవ్రంగా ఉన్నపుడు నాసల్ డైలేటర్ వాడడం
⦿ వెంటిలేషన్ సరిగ్గా ఉన్న గదుల్లోనే నిద్రపోవడం


స్లీప్ ఆప్నియాతో గురక సమస్య?


పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చెయ్యడం, మంచంలో కాళ్ల వైపు తలపెట్టుకోవడం, మాస్క్ వేసుకోవడం వంటి వాటితో పెద్ద ప్రయోజనం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. బరువు ఎక్కువగా ఉండడం, మద్యం పరిమితికి మించి తీసుకోవడం లేదా వెల్లకిలా పడుకోవడం వంటి వన్నీ కూడా గురకకు కారణం అవుతాయి. గుండెపోటు వంటి ప్రమాదకర అనారోగ్యాలకు స్లీప్ ఆప్నీయా కూడా ఒక కారణం. అంతేకాదు గురక పెట్టే వారికి భవిష్యత్తులో కంటి చూపు సమస్యలు కూడా రావచ్చట.


కాపురాలు కూలుస్తున్న గురక 


‘అండ్ సోటు బెడ్’ వారు జరిపిన మరో అధ్యయనంలో 23 శాతం మంది మహిళలు తమ భాగస్వాముల గురక వల్ల నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తేల్చారు. వీరిలో 39 శాతం మంది వేరే గదిలో నిద్రిస్తుండగా.. 13 శాతం మంది స్లిపింగ్ పిల్స్ వాడుతున్నారట. 11 శాతం మంది భాగస్వామిని వదిలేశారట. మీకూ ఈ సమస్యలు రాకూడదు అంటే.. ఇకపై గురకను తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా గురక గల కారణం తెలుసుకుని చికిత్స తీసుకోండి. 


Also Read: ఈ ఊర్లో మగాళ్లకు నో ఎంట్రీ, పొరపాటున వచ్చారో కటకటాలపాలే!