డెనిమ్... ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్. మందంగా ఉంటుంది. దీంతో తయారు చేసిన జీన్స్ వేసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. దాదాపు 90 శాతం యువత ఇప్పుడు వీటినే వేసుకుంటున్నారు. అయితే వీటిని మండే ఎండల్లో వేసుకుంటే అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వస్త్రం వేడిని గ్రహిస్తుంది. గాలి దాని గుండా లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఎండల్లో జీన్స్ వేసుకున్న చోట చెమట పట్టినా, అది ఆరకుండా చేస్తుంది. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మ ఎలర్జీలు, దద్దుర్లు వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మండుతున్న ఉష్ణోగ్రతల మధ్య జీన్స్ వేసుకోకపోవడమే మంచిది.


ఎండల్లో వడదెబ్బ కొట్టడం, డీహైడ్రేషన్ బారిన పడడం సహజం. వీటికి సకాలంలో చికిత్స చేయాల్సి ఉంటుంది. లేకుంటే ప్రాణాంతకంగా మారిపోతాయి.  అలాగే చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాన్ని అధికం చేస్తాయి. పురుషులు మహిళలు ఇద్దరూ ఇప్పుడు డెనిమ్స్ వేసుకుంటున్నారు. అవి సౌకర్యవంతంగా ఉంటాయని చెబుతున్నారు.కానీ వేసవి నెలలో వీటిని ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిది.


జీన్స్ కంఫర్ట్ గా ఉండడం, మంచి లుక్స్ ని ఇవ్వడం నిజమే. కానీ అది చర్మ అనారోగ్యాలను కూడా ఇస్తాయి. వేసవిలో అధికంగా చెమట పట్టడం వల్ల ఆ తడి ఆరిపోయే అవకాశం లేక, ఆ ప్రాంతంలో రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, జననేంద్రియ ప్రాంతంలో దద్దుర్లు వంటివి వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ ఫంగస్ ప్రారంభం అవుతుందో, అక్కడ చర్మం రంగు మారిపోతుంది. పొరలు పొరలుగా ఊడిపోతుంది. పగుళ్లు వస్తాయి. దురద, మంట పుట్టడం వంటివి జరుగుతాయి. అలాగే ఎక్కువసేపు టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల తొడల్లో రక్త ప్రసరణ ఆగిపోతుంది. పాదాలు ఉబ్బినట్టు అవుతాయి.


బిగుతుగా ఉండే జీన్స్ ధరించడం వల్ల చిన్న వయసులోనే గర్భాశయం ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది. డెనిమ్స్ వేసుకోవడం వల్ల స్త్రీ జననేంద్రియాలు చికాకు, ఈస్ట్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా చేరడం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇది ఆ ప్రాంతానికి గాలి తగలకుండా అడ్డుకుంటుంది. రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది.


దుస్తుల వల్ల వచ్చే చర్మ సమస్యను ‘టెక్స్ టైల్ డెర్మటైటిస్’ అని పిలుస్తారు. ఇది కొన్ని రకాల దుస్తుల వల్ల వస్తుంది. వేసవిలో ఇది వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా ఎగువ తొడ భాగంలో ఇది వస్తాయి. ఎరుపుగా చర్మం మారడం, పొలుసుల్లా రాలిపోవడం వంటివి జరుగుతాయి. 



Also read: భోజనం చేశాక ఇలా చేస్తే చాలు, మధుమేహం అదుపులో ఉండడం ఖాయం



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.