మగ డాక్టర్లు ఆపరేషన్ చేసిన మహిళల్లో అధిక శాతం మంది చనిపోయే అవకాశం ఎక్కువట... ఇది ఒక అధ్యయన ఫలితం. నమ్మశక్యంగా లేనప్పటికీ నిజమే అని చెబుతున్నారు పరిశోధకులు. ఎన్నో ఏళ్లు కష్టపడి మరి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అదే పురుషుల విషయానికి వస్తే మాత్రం, వారికి ఆపరేషన్ చేసింది మగవారైనా, ఆడవారైనా ఫలితం ఒకేలా ఉంటుందని తేలింది అధ్యయనంలో. అంతేకాదు మగసర్జన్ల దగ్గర ఆపరేషన్ చేయించుకున్న మహిళలు మళ్లీ మళ్లీ ఆసుపత్రికి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలో తెలిసింది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనే కారణాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు అధ్యయనకర్తలు. 


అధ్యయనం ఇలా సాగింది
కెనడాలోని ఒంటారియోలో పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. డాక్టర్ క్రిస్టోఫర్ వాలీస్ ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు.  2007 నుంచి 2019 మధ్య జరిగిన సర్జరీల జాబితాను తయారుచేశారు. అందులో దాదాపు 10 లక్షల మంది రోగులు సర్జరీలు చేయించుకున్నట్టు ఉంది. వారికి 2,937 మంది సర్జన్లు ఆపరేషన్లు చేశారు. వారిలో చనిపోయిన వారి డేటాను సిద్ధం చేశారు. అందులో మగ వైద్యుల దగ్గర సర్జరీ చేయించుకున్న మహిళల్లో 32 శాతం మంది మరణించినట్టు తేలింది. కానీ పురుషుల్లో మాత్రం ఇలాంటి డేటా ఏమీ లభించలేదు.వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. అంతేకాదు మగవైద్యుల చేత ఆపరేషన్ చేయించుకున్న మహిళలు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. 


ఎందుకిలా?
మగవైద్యులు ఆపరేషన్ చేస్తే మహిళల్లో మరణాల శాతం ఎందుకు పెరుగుతుంది? అనే దానికి కారణం మాత్రం అధ్యయనంలో తేల్చలేకపోయారు. కొంతమంది మహిళా వైద్యులు కొన్ని కారణాలను అంచనా వేశారు. మగ వైద్యులు మహిళా పేషెంట్లను సరిగా అర్థం చేసుకోరని, వారి భయాలను పట్టించుకోరని అభిప్రాయపడ్డారు. మహిళలు ప్రతి చిన్నదానికి కంగారు పడతారని, తొందరపెడతారని, ఆపరేషన్ అయ్యాక కంప్లయింట్లు ఎక్కువ ఇస్తారని... ఇలా మగ వైద్యులు భావిస్తారని అన్నారు. మహిళల నొప్పిని వారు తక్కువ అంచనా వేస్తారని కొంతమంది అంతర్జాతీయ స్థాయి మహిళ సర్జన్లు తెలిపారు. రోగి మహిళ అయినప్పుడు, వైద్యుడు పురుషుడు అయినప్పుడు వారిద్దరి మధ్య రిలేషన్ అంత మంచిగా ఉండదని గతంలోనే కొన్ని అధ్యయనాలు చెప్పాయి. మహిళా రోగులు అంత స్వేచ్ఛగా తమ బాధలను మగ డాక్టర్లతో షేర్ చేసుకోలేరని అనే భావన కూడా ఉంది. 


గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం మీకు అధ్యయనం తాలూకు వివరాలను అందించడం కోసమేనని గమనించగలరు. 


Also read: గాడిదపై ఊరేగింపులు, పిడిగుద్దులాటలు, డబ్బులిచ్చి రంగులు పూయించుకోవడాలు, హోలీ రోజున ఎన్ని వింత ఆచారాలో


Also read: ఈ వయాగ్రా ఖరీదు కిలో రూ.70 లక్షలు, దీని కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లెందరో