హిందూ సాంప్రదాయంలో హోలీ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగా కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను నిర్వహించుకుంటారు. అలాగే నరసింహస్వామి అవతారంలో రాక్షసరాజైన హిరణ్యకశిపుడిని చంపడంతో హోలీ వచ్చిందని కూడా చెప్పుకుంటారు.కథ ఏదైనా ‘హోలీ’ సంబరాలు చేసుకునే రోజు. ఆ రోజున ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సాంప్రదాయాలు, ఆచారాలు అనుసరిస్తారు. వాటిల్లో ఆసక్తి కరమైనవి ఇవిగో...


పిడిగుద్దులాట
బోధన్‌లోని హున్న ఊళ్లో మగవారు హోలీ రోజున పిడిగుద్దులాట ఆడతారు. పిడికిళ్లతో ఒకరినొకరు గుద్దుకుంటారు. కొంతమందికి దెబ్బలు గట్టిగా తగులుతాయి. గతంలో ఓసారి ఈ ఆటను జరపకపోయేసరికి ఊళ్లోని నీళ్ల ట్యాంకు కూలిపోయింది. దీంతో ప్రతి ఏడాది కచ్చితంగా ఈ ఆటను హోలీ రోజు ఆడుతున్నారు. 


భోగీ మంటలు
గుజరాత్ లోని పల్లెల్లో ఇది ప్రధాన పండుగ. వీధి వీధిన భోగీ మంటలు వేస్తారు. పాత వస్తువులన్నీ తెచ్చి పడేస్తారు. ఆ మంట చుట్టూ చేరి డ్యాన్సు చేస్తు, పాటలు పాడుతారు. ఇలా చేయడం చెడు జరగదని నమ్ముతారు. కొన్ని చోట్ల అమ్మాయిలు చీరలను తాళ్లలా పేనుతారు. వాటితో అబ్బాయిలు కొట్టి, రంగులు పూస్తారు. 


అమ్మాయిలకు డబ్బులిచ్చి...
మణిపూర్ హోలీ పండుగను ఆరు రోజులు నిర్వహించుకుంటారు. యోసంగ్ అని పిలిచే పండుగతో హోలీ విలీనమై పోయింది. ఈ రెండూ ఒకే రోజున నిర్వహిస్తారు. హోలీ రోజున గులాల్ అనే ఆటను ఆడడం అక్కడ సంప్రదాయంగా వస్తోంది. ఈ ఆట ఆడేందుకు అబ్బాయిలు అమ్మాయిలకు డబ్బులివ్వాల్సి ఉంటుంది. అలా డబ్బులిస్తే అమ్మాయిలు గులాల్ ఆట మగవారితో కలిసి ఆడతారు. 


మతంతో పనిలేదు
నేపాల్‌లో 80 శాతం మంది హిందువులే. అక్కడ హోలీ పండుగను భారీగా జరుపుతారు. వీరేకాదు ఆ దేశంలో ఉన్న ముస్లిములు, క్రైస్తవులు కూడా ఈ పండుగను నిర్వహించుకుంటారు. ఒకరిపై ఒకరు రంగు నీళ్లను పోసుకోవడాన్ని అక్కడ ‘లోలా’ అంటారు. అంటే నీటి బుడగ అని అర్థం. 


కర్రలతో కొడుతూ...
ఉత్తరప్రదేశ్ లోని బర్సాన అనే ఊరిలో హోలీ చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ ప్రసిద్ధ రాధా రాణి ఆలయం ఉంది. శ్రీ రాధే, శ్రీ కృష్ణ అని గట్టిగా అరుస్తారు. స్త్రీలు పురుషులను వెంటపడి కర్రలతో కొడతారు. పురుషులు ఆ దెబ్బలు తినేందుకు వాళ్లని పాటలతో, మాటలతో రెచ్చగొడుతూ ఉంటారు. ఇది అక్కడ చాలా ఉత్సహంగా జరిగే కార్యక్రమం. 


అల్లుడు గాడిదెక్కాల్సిందే
మహారాష్ట్రాలోని బీడ్ జిల్లాలో విదా గ్రామంలో గత వందేళ్ల నుంచి ఓ ఆచారం ఉంది. కొత్త అల్లుళ్లను హోలి రోజున గాడిద ఎక్కించి ఊరేగిస్తారు. అనంతరం కొత్త బట్టలు పెడతారు. హోలీ వస్తుందంటే కొత్త అల్లుళ్లు ముందే ఊరి నుంచి పారిపోతారు. కొంతమంది దాక్కుండి పోతారు. దాక్కున్న వారిని వెతికి తెచ్చి మరీ ఊరేగిస్తారు. 


Also read: ఈ వయాగ్రా ఖరీదు కిలో రూ.70 లక్షలు, దీని కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లెందరో


Also Read: వ్యాయామం చేయకుండానే బరువు తగ్గాలా? ఇలా ప్రయత్నించండి