బరువు తగ్గేందుకు జిమ్‌కి వెళ్లాలని, వాకింగ్ చేయాలని అందరికీ ఉంటుంది.కానీ కొందరికీ సమయం దొరకదు. ఆఫీసు పనులు, పిల్లలు, ఇంట్లో పనులు వీటికే సమయం సరిపోతుంది. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని ఫాలో అయితే కొంతమేరకు బరువు తగ్గే అవకాశం ఉంది. 


బ్లాక్ కాఫీ
టీ,కాఫీలు బంద్ చేసి బ్లాక్ కాఫీ తాగడం ప్రారంభించండి. దీన్ని రోజూ తాగడం వల్ల వారానికి  500 కేలరీలు బర్న్ చేయవచ్చు. అయితే దీన్ని చక్కెర లేకుండా తాగాలి. అప్పుడు కేలరీలు తగ్గుతాయి. పంచదార కలుపుకుంటే మాత్రం కేలరీలు పెరుగుతాయి. దానివల్ల బరువు పెరుగుతారు కానీ తగ్గరు. పంచదార లేకుండా తాగడం వల్ల మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత, జీవక్రియలోని సమస్యలను తగ్గించడంలో కూడా సాయపడుతుంది. 


ఆరోగ్యకరమైన చిరుతిళ్లు
చిరుతిళ్లు అనగానే నూనెలో వేయించిన చిప్స్, పకోడీలు, బజ్జీలు గుర్తుకువస్తాయి. వాటిని అధికంగా తింటుంటారు. చిరుతిళ్ల జాబితా నుంచి వాటిని తీసేసి పండ్లను చేర్చుకోండి. అలాగే గ్రీన్ టీని తాగండి. బరువు తగ్గేవరకు కఠినంగా వేయించిన చిరుతిళ్లను తినడం ఆపండి. ఫాస్ట్ ఫుడ్స్ కూడా మానేయాలి. 


ప్రశాంతమైన నిద్ర
అతిగా నిద్రపోతే బరువు పెరుగుతారు, అదే సరిపడినంత నిద్రపోతే బరువు తగ్గుతారు. అందుకే రాత్రి దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటలు కంటినిండా నిద్రపోండి. ఒక వ్యక్తి నిద్రా వ్యవస్థ సవ్యంగా ఉంటే హార్మోన్లు కూడా సరిగ్గా పనిచేస్తాయి. దీనివల్ల బరువు త్వరగా పెరగడం జరుగదు. నిద్రా సైకిల్ సరిగా లేకపోతే గ్రెలిన్ వంటి హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. ఇవి ఆహారాన్ని తినాలన్న కోరికను పెంచేస్తాయి. బరువు పెరగడానికి కారణమవుతాయి. 


నీరు తాగడం
ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు కచ్చితంగా తాగాలి. బరువు తగ్గేందుకు ఇది చాలా సహకరిస్తుంది. శరీరం ఎంత తేమవంతంగా ఉంటే అంత మంచిది. నీరు పొట్ట నిండిన ఫీలింగ్ ను కలిగిస్తుంది. అధికంగా ఆహారం తినరు. తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటికి పోతాయి. మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే బరువు అంత సులువుగా తగ్గుతారు. 


క్యాన్ ఫుడ్ 
క్యాన్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇప్పుడు ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. వాటిపై తక్కువ క్యాలరీలు, షుగర్ ఫ్రీ అని రాయగానే చాలా మంది కొనేస్తుంటారు. కానీ వాటిలో ప్రిజర్వేటివ్ లు కలుపుతారన్న విషయం మరిచిపోతారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కోసం అలా చేస్తారు. ఈ ప్రిజర్వేటివ్ లు కూడా రసాయనాలే. వాటి వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి వీటిని కూడా తినడం మానేయాలి. 


Also read: ఈ వయాగ్రా ఖరీదు కిలో రూ.70 లక్షలు, దీని కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లెందరో


Also read: బరువు తగ్గేందుకు లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నారా? ముందుగా వాటి దుష్ప్రభావాలేంటో తెలుసుకోండి