పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు క్రీడాకారుడిని రాజ్యసభకు పంపించాలని డిసైడ్ చేశారు. 


పంజాబ్‌లో క్రీడలను ప్రోత్సహించడం అనేది మాన్ పోల్‌ వాగ్దానాల్లో ఒకటి. తమను గెలిపిస్తే క్రీడలను ప్రోత్సహించి పారదర్శక విధానాలు తీసుకొస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. అందుకే వీలైనంత త్వరగా దీన్ని అమలు చేయాలని భావిస్తోంది నూతన ప్రభుత్వం. 


ఏబీపీ న్యూస్‌కు అందిన సమాచారం మేరకు పంజాబ్‌ నుంచి హర్భజన్‌ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు సీటు ఇస్తారని వినికిడి. 


పంజాబ్‌ కొత్త సీఎం భగవంత్ సింగ్‌ మాన్‌కు హర్భజన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆప్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మాన్‌కు హర్భజన శుభాకాంక్షలు కూడా చెప్పారు. 


పంజాబ్‌లో క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించేందుకు మరో కీలక బాధ్యతలను కూడా హర్భజన్‌కు అప్పగించాలని యోచిస్తోంది పంజాబ్‌ ప్రభుత్వం. త్వరలో ఏర్పాటు చేయబోయే జలంధర్ స్పోర్ట్ యూనివర్శిటీ బాధ్యతలను కూడా ఆయనకు ఇస్తారని పార్టీలో చర్చ సాగుతోంది. పంజాబ్ ఎన్నికల్లో పోటీ సమయంలో ప్రజలకు చాలా హామీలు ఇచ్చింది ఆప్. అందులో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి. 


కాంగ్రెస్‌ను గద్దె దించి పంజాబ్ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. ఈరోజు నుంచే పనులు ప్రారంభించేశారు మాన్. 


స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామంలో వేల మంది ప్రజలతో సమక్షంలో పదవీ ప్రామాణం చేశారు భగవత్‌ సింగ్ మాన్‌. తాము ఒక్క రోజు కూడా వృథా చేయబోమన్న మాన్... ఇవాల్టి నుంచే పని స్టార్ట్ చేశారు. ఇప్పటికే డబ్భై ఏళ్లు వేస్ట్ చేశామని గత పాలకులకు చురకలు అంటించారు. 


ప్రమాణ స్వీకారానికి వచ్చిన వారంతా తలపాగాలు, పసుపు రంగులో 'దుపట్టాలు' ధరించారు. ఆదృశ్యం చూడముచ్చటగా ఉంది. త్వరలోనే ఇతర మంత్రి వర్గాన్ని కూడా నియమించి ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తి చేయనున్నారు. 


పంజాబ్‌లోని 117 సీట్లలో 92 స్థానాలను గెలుచుకున్న ఆప్‌... దిల్లీ తర్వాత రెండో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 


సంగ్రూర్ నుంచి పంజాబ్‌ ముఖ్యమంత్రి మాన్‌ రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఈసారి పంజాబ్ ఎన్నికలు అతను అసెంబ్లీకి పోటీ చేశారు. పంజాబ్ ఆప్ అధ్యక్షుడిగా సంగ్రూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ధురి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 58,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.