ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 24న మోదీ.. జమ్ముకశ్మీర్ వెళ్లనున్నట్లు ABP న్యూస్‌కు విశ్వసనీయ సమాచారం.
పంచాయతీ రాజ్
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం రోజు.. నేతలంతా పంచాయతీలు, గ్రామ ప్రతినిధులను కలుస్తుంటారు. ఇందులో భాగంగానే మోదీ ఈసారి జమ్ముకశ్మీర్ వెళ్తున్నారని తెలుస్తోంది.
జమ్ముకశ్మీర్‌లో చివరిగా పంచాయతీ ఎన్నికలు 2018లో జరిగాయి. అయితే ఇటీవల ఉగ్రవాదుల కాల్పుల్లో జమ్ముకశ్మీర్‌కు చెందిన ముగ్గురు సర్పంచ్‌లు మృతి చెందారు. దీంతో జమ్ముకశ్మీర్‌లో ప్రజాప్రతినిధుల భద్రతపై దృష్టి పెట్టాలని అధికార యంత్రాంగాన్ని కేంద్రం ఆదేశించింది.
మార్చి 12న కశ్మీర్ కుల్గాం జిల్లాలో అదౌరా సర్పంచ్ అహ్మద్ మిర్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. నెలలో ఇది ముడో కాల్పుల ఘటన.
ఆర్టికల్ 370 రద్దు
2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలానే జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదా పోయింది.
ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు చెప్పారు.
అసెంబ్లీ స్థానాలు
జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ, పార్లమెంటు సెగ్మెంట్ల మార్పుపై ఇటీవల ప్రభుత్వ కమిటీ డ్రాఫ్ట్ తయారు చేసింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత నియోజకవర్గాల బౌండరీలను కూడా మళ్లీ తదనుగుణంగా మార్చాల్సి ఉంది.
అయితే ఈ డ్రాఫ్ట్‌లో సూచించిన ఓ మార్పుపై స్థానిక పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడున్నవాటితో కలిపి జమ్ములో ఆరు అసెంబ్లీ సీట్లు, కశ్మీర్‌లో ఓ స్థానాన్ని పెంచనున్నట్లు కమిటీ తెలిపింది.
అయితే లోక్‌సభ స్థానాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. కానీ అసెంబ్లీ స్థానాలు మాత్రం 83 నుంచి 90కి పెంచింది. ఇందులో ఏడు స్థానాలు ఎస్సీ, 9 స్థానాలు ఎస్టీకి రిజర్వ్ చేశారు. ఈ నిర్ణయాలు పూర్తయిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని గత నెలలో అమిత్ షా తెలిపారు.
Also Read: Hyperloop Technology: హైదరాబాద్ టూ విజయవాడ కేవలం 15 నిమిషాల్లో! రండి బాబు రండి!
Also Read: Hijab Ban Case: హోలీ తర్వాతే మళ్లీ హిజాబ్- అత్యవసర విచారణకు సుప్రీం నో