350 కిలోమీటర్లు.. కేవలం 25 నిమిషాల ప్రయాణం! షాకయ్యారా? కానీ ఇది త్వరలోనే నిజం కానుంది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి పేద దేశాల వరకు అన్నీ ప్రయాణ సమయాన్ని తగ్గించడానికే ఆలోచిస్తాయి. రోడ్డు, రైలు, వాయు, సముద్ర మార్గాల ద్వారా ప్రయాణాలు చేస్తున్నారు. అయితే ఆ సమయాన్ని కూడా తగ్గించేందుకు సరికొత్త టెక్నాలజీలను సృష్టిస్తున్నారు. అలాంటిదే హైపర్‌లూప్ టెక్నాలజీ. ఈ సాంకేతికతతో చెన్నై నుంచి బెంగళూరుకు అంటే 350 కిమీ దూరాన్ని కేవలం 25 నిమిషాల్లో చేరుకోవచ్చు.


అలా మొదలైంది


ఈ హైపర్‌లూప్ టెక్నాలజీపై చెన్నై ఐఐటీ విద్యార్థులు అధ్యయనం చేస్తున్నారు. ఈ సాంకేతికత కార్యరూపంలోకి వస్తే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చని పేర్కొన్నారు.


ఈ హైపర్ లూప్ ఐడియాను టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ముందుగా చెప్పారు. ఈ టెక్నాలజీతో ప్రయాణ సమయాన్ని తగ్గించొచ్చన్నారు. సాధారణంగా ఓ వాహన వేగం అనేది ఘర్షణ, ఎయిర్‌ రెసిస్టెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.




ఏంటీ సాంకేతికత 


వేగాన్ని నియంత్రించే ఈ ఫ్రిక్షన్, ఎయిర్‌ రెసిస్టెన్స్‌ను హైపర్‌లూప్ టెక్నాలజీ వినియోగించి అధిగమించొచ్చు. ఈ టెక్నాలజీ సాయంతో చెన్నై నుంచి బెంగళూరు ప్రయాణించాలంటే రెండు నగరాల మధ్య ఓ భారీ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఇందులోకి గాలిని పంపించి వాక్యూమ్‌ను సృష్టిస్తారు. ఆ తర్వాత పాసింజర్ పాడ్ (ప్రయాణికులు కూర్చొనే వీలుగా ఉండే )ను ఆ ట్యూబ్‌కు అటాచ్ చేస్తారు.


ఆ తర్వాత ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌ను అయస్కాంత క్షేత్ర విక్షేపం (మేగ్నెటిక్ ఫీల్డ్ డిఫ్లెక్షన్) ద్వారా ప్రయాణించేలా చేస్తారు. అమెరికా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు భవిష్యత్తులో ఈ టెక్నాలజీని కార్యరూపంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి.


సరికొత్త చరిత్ర


ఈ హైపర్‌లూప్ టెక్నాలజీ సాయంతో ఓ వాహనాన్ని 100 మీటర్లు నడిపించి చెన్నై ఐఐటీ విద్యార్థులు ఎన్నో అవార్డులు పొందారు. త్వరలోనే 500 మీటర్ల పాటు ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది విజయవంతమైతే భారత ప్రయాణ చరిత్రలో మరో రికార్డ్ సృష్టించినట్లే.  


స్పీడ్


ఈ హైపర్‌లూప్ వాహనం గంటకు 1,223 కిమీ వేగంతో ప్రయాణం చేయగలదు. ​​అంటే చెన్నై నుంచి ముంబయికి కేవలం గంటలో వెళ్లిపోవచ్చు. అదే చెన్నై నుంచి బెంగళూరు వెళ్లాలంటే 25 నిమిషాలు సరిపోతుంది. అదే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే 15 నిమిషాలు సరిపోతుందన్నమాట!


Also Read: Hijab Ban Case: హోలీ తర్వాతే మళ్లీ హిజాబ్- అత్యవసర విచారణకు సుప్రీం నో


Also Read: Putin Vs Musk : పుతిన్ తనతో యుద్ధం చేసేదాకా వదిలి పెట్టేలా లేడు ఎలన్ మస్క్ ! ఈ ట్వీట్లు చూస్తే నవ్వాపుకోలేరు