రీరంలోని అన్ని భాగాల్లోకెల్లా అత్యంత సున్నితమైనవి కళ్ళు, ముక్కు. వాటికి ఏ చిన్న దెబ్బ తగిలినా పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. అయితే చాలామంది కళ్ల కంటే తమ శరీరంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో కళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ ఎక్కువ గంటలు చూడటం వల్ల కళ్ళు అలిసిపోతాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల మాత్రమే కాదు, ఊబకాయం వల్ల కూడా కళ్ళకి హాని ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా తినడం, ఇతర కారణాల వల్ల ఊబకాయం సమస్యలు వస్తాయి. దానితో పాటు ఇతర సమస్యలు కూడా వెంటాడుతాయి.


ఊబకాయం వల్ల పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతాయని చాలా మందికి తెలుసు. కానీ అది కళ్ళని కూడా ప్రభావితం చేస్తుంది. స్థూలకాయం వల్ల దృష్టి లోపం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా రెటీనా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కళ్ళలోని చిన్న రక్త నాళాలు బలహీనంగా మారినప్పుడు ఈ వ్యాధులు అభివృద్ధి చెందుతాయి. కంటి ప్రాంతానికి ఆక్సిజన్, ఇతర అవసరమైన పోషకాలు సరఫరా సక్రమంగా జరగదు. కళ్ళకి ఆక్సిజన్, పోషకాలు అందకపోతే రెటీనా వ్యాధులు వచ్చి దృష్టి లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇవి లోపించడం వల్ల వచ్చే అనార్థాలు..


⦿ డయాబెటిక్ రెటినోపతి


⦿ గ్లకోమా


⦿ స్ట్రోక్ వల్ల కంటి చూపు దెబ్బతినడం


⦿ వయసు ప్రభావం వల్ల కంట్లో మచ్చలు ఏర్పడటం


⦿ కంటి శుక్లాలు


ఊబకాయం కళ్ళని ప్రభావితం చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే ముందు బరువు మీద అవగాహన కలిగి ఉండాలి. వయస్సు, ఎత్తు ఆధారంగా తగిన బరువు ఉన్నారో లేదో అనేది బాడీ మాస్ ఇండెక్స్(BMI) వల్ల తెలుసుకోవచ్చు. కణజాల ద్రవ్యరాశి, ఎత్తు ఆధారంగా BMI స్కోర్ లెక్కిస్తారు. దీన్ని kg/m2గా కొలుస్తారు.


⦿ తక్కువ బరువు: 18.5 kg/m2 తక్కువ


⦿ సాధారణ బరువు: 18.6 నుంచి  24.9 kg/m2


⦿ అధిక బరువు: 25 నుంచి  29.9 kg/m2


⦿ ఊబకాయం: 30 kg/m2 కంటే ఎక్కువ


ఊబకాయం కళ్ళని ఎలా ప్రభావితం చేస్తుంది?


25-30 బాడీ మాస్ ఇండెక్స్ (BMI)ను అధిక బరువుగా పరిగణిస్తారు. 30 కంటే ఎక్కువ BMI ఉంటే అది ఊబకాయమే. ఊబకాయం వల్ల కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇటీవల కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. డయాబెటిక్ రెటినోపతి, ఫ్లాపీ కనురెప్పల సిండ్రోమ్, రెటీనా సిరలు మూసుకుపోవడం, స్ట్రోక్ వల్ల దృష్టి మందగించడం అనేవి ఊబకాయం వల్ల వస్తాయి. స్థూలకాయం వల్ల కంటి శుక్లం అభివృద్ధి చెందుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు వల్ల కూడా కంటి జబ్బులు వస్తాయి.  


బయటపడే మార్గం ఏంటి?


బరువు తగ్గించుకుంటే వీటి నుంచి బయట పడేందుకు మార్గం ఉంటుంది. పోషకాహారం తీసుకోవాలి, చురుగ్గా ఉండాలి. క్రమం తప్పకుండా కంటి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. శరీర, కంటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు డైట్లో భాగం చేసుకోవాలి. విటమిన్లు సి, ఇ, జియాక్సంతిన్, ఒమేగా 3, జింక్, లుటీన్‌ ప్రోటీన్లు ఆహారంలో చేర్చుకోవాలి. అవి కొన్ని కంటి వ్యాధులను ఆలస్యం చేయడం లేదా నివారించడంలో సహాయపడతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: డయాబెటిస్ అదుపులో ఉండాలా? ఈ ఆయుర్వేద మార్గాలు ట్రై చెయ్యండి