స్టవ్ మీద పాలు పెట్టి ఎక్కువ శాతం మరిచిపోయే వాళ్లే అధికం. ఇతర పనులు చేసుకుంటూ స్టవ్ మీద పాలు పెట్టిన విషయాన్ని మరిచిపోతే అవి పొంగిపోతాయి. రోజూ ఇలా పొంగిపోవడం వల్ల చాలా పాలు వృధా అవుతాయి. కాబట్టి పాలు పొంగిపోకుండా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. పాలు వృధాగా పోకుండా ఉంటాయి.


చాలామందికి తెలియని విషయం ఏంటంటే పాలు మరగబెట్టేముందు ఆ పాలు పట్టినంత గిన్నె పెడితే చాలు అనుకుంటారు. అలా పెట్టడం వల్ల పాలు త్వరగా పొంగిపోతాయి. పాలు పరిమాణం కన్నా రెండు రెట్లు పెద్దగా ఉన్న గిన్నెలో పాలను మరగబెట్టాలి. ఇలా చేయడం వల్ల పాలు త్వరగా పొంగి బయటపడవు. కొంతవరకు పైకి లేచినా అక్కడితో ఆగిపోతాయి. కానీ గిన్నె నుంచి బయటికి పొంగి పొరలి రావు. కాబట్టి పెద్ద గిన్నెలో పాలను మరిగించడం అలవాటు చేసుకోండి. అలాగే పాలు మరుగుతున్న గిన్నెపైన చెక్క గరిటెను ఉంచడం వల్ల కూడా పాలు పొంగి పొంగిపోకుండా అడ్డుకోవచ్చు. ఈ గరిటె పాలను కిందకి నెట్టడానికి సహాయపడుతుంది. పాలు పొంగుతున్నప్పుడు వ్యతిరేక దిశలో ఏదైనా తగిలితే పాలు పైకి రాకుండా కిందకి వెళ్తాయి. అందుకే చాలామంది పైనుంచి ఊదుతూ ఉంటారు. ఊదడం వల్ల పాలు పైకి ఎగజిమ్మే అవకాశం తగ్గుతుంది.


పాలల్లో చిటికెడు ఉప్పును వేయడం ద్వారా కూడా పాలు పొంగకుండా అడ్డుకోవచ్చు. ఉప్పు వేయడం వల్ల పాలు విరిగిపోతాయేమో అనే సందేహం వద్దు. చిటికెడు ఉప్పును కలపడం వల్ల పాలు పొంగిపోవు. విరిగిపోవు. పాలు పొంగుతున్నప్పుడు పైన చిటికెడు ఉప్పును అలా చల్లండి చాలు.  అలాగే గిన్నెలో పాలు పొంగిపోతున్నప్పుడు ఒక స్పూన్ తో కలుపుతూ ఉండండి. అప్పుడు అవి పొంగకుండా ఉంటాయి. ఇది వేడిని ఒకే చోట ఉంచకుండా గిన్నె అంతా వ్యాపించేలా చేస్తుంది. దానివల్లే ఒకే చోట పాలు పైకి రాకుండా చుట్టుపక్కలకు సర్దుకుంటాయి. కాబట్టి పాలు పొంగిపోతున్నప్పుడు ఒక స్పూన్ తో గిరిగిరా కలుపుతూ ఉండండి. పాలు మరిగించే ముందు ఆ గిన్నెకి కింద వెన్న రాయండి. పాలు చక్కగా మరుగుతాయి. పాలు పొంగకుండా మరుగుతాయి. పాలు విరిగిపోవడం వంటివి కూడా జరగవు.  అయితే వెన్న మాత్రం అధికంగా రాయకూడదు. లేకపోతే పాలు విరిగిపోయే అవకావం ఉంది. ఇలాంటి  చిట్కాలు పాటిస్తే పాలు వేస్టు కాకుండా ఉంటాయి.  


Also read: గర్భిణులు జాగ్రత్తా, చిగుళ్ల సమస్య ఉంటే ముందే ప్రసవం



Also read: ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఏడు వస్తువులు మీరు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు


































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.