గర్భం ధరించాక తినే ఆహారం పైనే కాదు, శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న సమస్య అయినా అది పెద్ద నష్టానికి కారణం కావచ్చు. ఎంతో మందికి తెలియని విషయం ఏంటంటే చిగుళ్ళ నొప్పి, వ్యాధులు వంటివి గర్భిణులకు వస్తే చాలా ప్రమాదం. అవి నెలలు నిండకుండానే ముందే ప్రసవం అయ్యేలా చేస్తాయి. అందుకే గర్భిణులు చిగుళ్ల వ్యాధులను తేలిగ్గా తీసుకోకూడదు. నిజం చెప్పాలంటే చిగుళ్ల వ్యాధి పూర్తిగా తగ్గిపోయాకే గర్భం ధరించడం అన్ని విధాలా మంచిది.
యూనివర్సిటీ ఆఫ్ సిడ్ని శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో చిగుళ్ల వాపు కారణంగా నెలలు నిండకముందే కాన్పయ్యే ముప్పు అధికంగా ఉన్నట్టు కనిపెట్టారు. చిగుళ్ళ వాపును జింజివైటిస్ అంటారు. ఇది వస్తే దంతాలపై గార పేరుకు పోతుంది. చిగుళ్ళు వాపు వస్తుంది. నొప్పి కూడా పెడతాయి. దీన్ని చాలా మంది తేలికగా తీసుకుంటారు. నోటికి, గర్భంలోని శిశువుకు ఎలాంటి సంబంధం లేదనుకుంటారు. కానీ ఏదైనా నోటి ద్వారానే శరీరంలోకి చేరుతుందని అర్థం చేసుకోవాలి. చిగుళ్ల వాపుకు కారణమైన బ్యాక్టీరియా నోట్లోంచి రక్తానికి, రక్తం నుంచి మాయకు చేరుకునే ప్రమాదం ఎక్కువ. మాయ ద్వారా బిడ్డకు చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల నెలలు నిండకముందే నొప్పులు రావచ్చు. ఎనిమిదో నెలలో కూడా కాన్పయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి గర్భధారణ సమయంలో నోటి పరిశుభ్రతకు సమయాన్ని కేటాయించాలి.
ఎంతోమంది గర్భిణులకు ఇలా చిగుళ్ల జబ్బు, చిగుళ్ల వాపు వంటివి ప్రమాదకరమైనవని తెలియదు. ఇలా తెలియక 70 శాతం మంది గర్భిణీలు చిగుళ్ల వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలా చిగుళ్ళ వ్యాధులు గర్భిణీలో మధుమేహం, కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని కూడా పెంచుతాయి. కాబట్టి ఎలాంటి చిగుళ్ల సమస్య కనబడేనా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ముందుగా దానికి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన నోటి పరిశుభ్రత లేకపోవడం వల్ల చిగుళ్లలో బ్యాక్టీరియాలు చేరుతాయి. చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు వస్తాయి. ఈ జింజివైటిస్ సమస్యకు చికిత్స తీసుకోపోతే అది ప్రమాదకరమైన పెరియోడాంటైటిస్‌గా మారుతుంది.
విటమిన్ సి లోపం వల్ల కూడా చిగుళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినడం అవసరం. కొన్నిసార్లు మనం తిన్న ఆహారాలు పంటి మధ్య ఇరుక్కుపోతాయి. అవి అక్కడ రోజుల తరబడి పేరుకుపోయి బ్యాక్టీరియాకు కారణం అవుతాయి. అలాగే నోటి దుర్వాసన కూడా రావచ్చు.
Also read: ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఏడు వస్తువులు మీరు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.