ఉప్పు లేనిదే కూరకు రుచి ఉండదు. కానీ, కొందరు చప్పగా ఉందంటే పరిమితి కంటే ఎక్కువ ఉప్పును తినేస్తుంటారు. అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలకు అలవాటు పడుతున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఇప్పటికే చాలా అధ్యయనాలు, పరిశోధనలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉప్పు తగ్గించి తీసుకోవాలని సూచించారు. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. రాక్ సాల్ట్ మంచిదా.. సాధారణ ఉప్పు మంచిదా అనే సందేహాలకు కూడా పుల్ స్టాప్ పెట్టింది. ఏ రకం ఉప్పైనా సరే.. పరిమితికి మించి తీసుకుంటే ముప్పేనని తెలిపింది.
ఏ ఉప్పు మంచిది?
ఇప్పటివరకు మనం సముద్రపు ఉప్పును మాత్రమే ఎక్కువగా ఉపయోగించే వాళ్లం. ప్రస్తుతం మార్కెట్లో మరో రెండు రకాల రాతి ఉప్పులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి రాక్ సాల్ట్. దీన్నే పింక్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. దీనితోపాటు బ్లాక్ సాల్ట్‌ను చాలామంది వాడుతున్నారు. ఈ రెండు రకాల ఉప్పులు.. మనం వాడే రెగ్యులర్ సాల్ట్ కంటే మంచివని, ఆరోగ్యానికి మేలు చేస్తాయనే ప్రచారం ఉంది. దీంతో అంతా అటువైపు మొగ్గుతున్నారు.
రాక్ సాల్ట్, నల్ల ఉప్పులో పోటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఉఫ్పు రకాలను రెగ్యులర్ సాల్ట్ తరహాలో రిఫైన్ చెయ్యరు. కనుక అందులో ఖనిజాలకు ఎలాంటి నష్టం ఉండదు. పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ లను వాటి రంగు, వాసనల ద్వారా చాలా సులభంగానే గుర్తించవచ్చు. ఈ ఉప్పు రకాలను నిల్వచెయ్యడానికి రకరకాల సుగంధ ద్రవ్యాలను, బొగ్గు, చెట్ల బెరడు వంటి వాటిని ఉపయోగిస్తారు. అందువల్ల ఇవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. అయితే ఈ సాల్ట్స్‌లో కూడా సాధారణ ఉప్పులో ఉండే సోడియం ఉంటుంది. కనుక ఈ కొత్త రకం ఉప్పులు ఆరోగ్యానికి మేలు చేసినా.. మితంగా తీసుకోవడమే ఉత్తమం అని ICMR సూచించింది.
ఉప్పు ఎక్కువ తింటే...?
- ఉప్పు ఎక్కువ తింటే బీపీ పెరిగిపోతుంది. రక్తనాళాల మీద రక్త పీడన ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు కారణం అవుతుంది. అంతే కాదు ఉప్పు ఎక్కువ తింటే జీర్ణవ్వవస్థ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇది జీర్ణాశయ క్యాన్సర్ కు కారణం కాగలదు.
- ఉఫ్పు ఎక్కువ తినేవారిలో బీపీ మాత్రమే కాదు జీర్ణాశయ లోపలి పొరకు నష్టం కలిగిస్తుంది. అందువల్ల గ్యాస్ట్రిక్ అట్రోఫీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
- ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువైన సోడియంను విసర్జించేప్పుడు కాల్షియం కూడా బయటకు పోతుంది. ఫలితంగా కాల్షియం లోపించి ఎముకల సమస్య వస్తుంది. ఏ రకమైన ఉప్పులో నైన సోడియం స్థాయి ఒకే విధంగా ఉంటుంది కనుక పరిమితిల్లో ఉప్పు వాడడం అన్నిరకాలుగానూ ఆరోగ్యానికి మంచిది.
Also Read : ధ్యానంతో బరువు తగ్గొచ్చట - ఇవిగో.. ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి చాలు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.