సాధారణంగానే గర్భిణీలు ప్రయాణం చేయాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. కరోనా వచ్చిన తర్వాత ప్రయాణం అంటే ప్రమాదం అనేంతగా భయం మొదలైంది. కానీ ఇప్పుడు కాస్త పరిస్థితులు మునుపటిలాగా లేవు. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కరోనా గురించి భయం పోయింది. ఇప్పుడు గర్భిణులు ప్రయాణం చేసేందుకు రూల్స్ కూడా మారిపోయాయి. అయినప్పటికీ ఇంట్లో వాళ్ళు గర్భిణీలని బయటకి పంపించాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే గర్భస్రావం అవుతుందేమోననే భయం. అందుకే బయటకి వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.


ఎప్పుడు ప్రయాణం చేయాలి


డెలివరీ డేట్ దగ్గర పడుతున్న సమయంలో, మొదటి ట్రై మిస్టర్ వేళ ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఏ క్షణమైనా డెలివరీ అవుతుంది కాబట్టి అటువంటి టైమ్ లో ప్రయాణం అసలు శ్రేయస్కరం కాదు. మొదటి నెలల్లో కొంతమందికి వికారం, వాంతులు, నీరసం, మార్నింగ్ సిక్ నెస్ గా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ప్రయాణం అసౌకర్యంగా అనిపిస్తుంది. ఒక్కోసారి గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే 4 నుంచి 6 నెలల సమయంలో ప్రయాణాలు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.


ట్రాన్స్ పోర్ట్


దూర ప్రయాణాలు వెళ్లాల్సి వస్తే చాలా మంది కారుని ఎంచుకుంటారు. కానీ ఒక విధంగా అది మంచి ఆలోచన కానప్పటికీ దాని వల్ల కొద్దిగా ప్రయోజనం ఉంటుంది. మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకోవచ్చు. కారులో వెళ్తున్నప్పుడు పాదాలు, వేళ్ళు కదిలించడం వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇక విమానంలో ప్రయాణించడం గర్భిణీ స్త్రీకి హానికరం కానప్పటికీ విమానయాన సంస్థ ఇచ్చే ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత ప్రయాణం చేయాలి. 28-34 వారాల గర్భధారణ మధ్య ఫిట్ టు ఫ్లై సర్టిఫికెట్ ఇస్తారు. 4 గంటలు కంటే ఎక్కువ దూర ప్రయాణం అయితే డీప్ వెయిన్ థ్రాంబోసిస్( సిరల్లో రక్తం గడ్డ కట్టడం) వంటి పరిస్థితి తలెత్తుతుంది.


ట్రావెల్ లో ఫుడ్


గర్భధారణ సమయంలో ప్రయాణం చేసేటప్పుడు బయట దొరికే నీరు, ఫుడ్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ కి గురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకంగా బాటిల్ వాటర్ ఎంచుకోవడం ముఖ్యం. బయట లభించే ఆహార ఉత్పత్తులు నాణ్యంగా ఉండవు వాటి వల్ల వాంతులు అయ్యే ప్రమాదం ఉంది.


మెడికల్ రిపోర్ట్స్ తప్పనిసరి


గర్భిణీలు ఎప్పుడు ప్రయాణాలు చేయాలని అనుకుంటే వారి మెడికల్ రిపోర్ట్స్ వెంట పెట్టుకుని వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఏదైనా అత్యవసరం అయినప్పుడు వైద్యం చేసే నిపుణులు పాత రిపోర్ట్స్ చూస్తే సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఏదైనా అత్యవసరం అనిపిస్తే చికిత్స అందించేందుకు వీలుగా ఉంటుంది.


వాక్సిన్


గర్భాదారణ సమయంలో లైవ్ వ్యాక్సిన్స్ వేసుకోవడం పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది. ఏదైనా వ్యాక్సిన్ తీసుకునే ముందు తప్పనిసరిగా గైనకాలజిస్ట్ ని సంప్రదించడం ముఖ్యం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: బాలిక ప్రాణం తీసిన డియోడరెంట్ - ఆ వాసన ఎందుకంత డేంజర్? మీ పిల్లలు జాగ్రత్త!