ఆమె పేరు కారా. అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తోంది. గర్భం ధరించడం చాలా కష్టమైపోయింది. మూడుసార్లు గర్భస్రావం కూడా జరిగింది. పిల్లల కోసం అల్లాడిపోయింది కారా. అప్పుడు గర్భం దాల్చింది. 2018లో ఒక బాబుకు జన్మనిచ్చింది.కారా భర్తకు పిల్లలంటే చాలా ఇష్టం. దీంతో కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండాల్సిందే అని పట్టుబట్టాడు. దీంతో మళ్లీ గర్భం దాల్చింది ఆమె. ఇంత వరక కథ రొటీనే. ఏడు వారాల గర్భంతో ఉన్నప్పుడు ఆమె చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లింది. అప్పుడు ఆమెకు వైద్యులు విచిత్రమైన సంగతిని చెప్పారు. ఆమె గర్భంతో ఉండగానే మళ్లీ గర్భం దాల్చినట్టు చెప్పారు. దీంతో కారాకు ఏమీ అర్థం కాలేదు. వైద్యులకు సైతం ఈ పరిస్థితి చాలా వింతగా అనిపించింది. 


గర్భం ధరించిన ఏడు వారాల తరువాత స్కానింగ్ లో వైద్యులు మరో పిండాన్ని గుర్తించారు. అంతకుముందు ఆ పిండం ఏర్పడలేదు. మొదటి పిండం ఏర్పడిన కొన్ని వారాల తరువాత రెండో పిండం ఏర్పడినట్టు గుర్తించారు. దీంతో ఆమె గర్భంతో ఉండగానే మళ్లీ గర్భవతి అయినట్టు చెప్పారు వైద్యులు. ఇది అరుదైన ఘటన అని కూడా చెప్పారు. ఇలా ఎవరికీ జరగదని, కవలలు పుట్టే వారిలో రెండు పిండాలు ఒకే సమయంలో ఏర్పడతాయి కానీ కొన్ని వారాల గ్యాప్ తో పిండాలు ఏర్పడడం వింతగా ఉందని చెప్పారు. అంతేకాదు కారా గర్భంలోని రెండు పిండాలు ఆరోగ్యంగా ఎదిగి ఇద్దరు బిడ్డలుగా మారాయి. కొన్ని వారాల తేడాతో రెండు గర్భాలు ఏర్పడినప్పటికీ పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. అంతేకాదు ఇద్దరు పిల్లల ప్రసవం ఆరు నిమిషాల తేడాతో జరిగింది. ఇద్దరిలో ఎదుగుదల కూడా సమానంగా ఉంది. 


అలా జరుగుతుందా?
గర్భం దాల్చాక మళ్లీ ఫలదీకరణం జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే గర్భం దాల్చాక సాధారణంగా పీరియడ్స్ నిలిచిపోతాయి. అంటే అండాల విడుదల ఉండదు. ఆ సమయంలో భార్యభర్తలు కలిసినా కూడా అండం విడుదల కాకపోవడం వల్ల పిండం ఏర్పడదు. అలాంటప్పుడు కారా గర్భం దాల్చాక ఎలా మళ్లీ గర్భవతి అయింది? ఈ వైద్య పరిస్థితిని సూపర్ఫెటెషన్ అంటారు. అంటే చాలా అరుదుగా గర్భం దాల్చాక కూడా కొంతమంది మహిళల్లో అండం విడుదలవుతుంది. కారా విషయంలో కూడా అలాగే జరిగింది. మనుషుల్లో సూపర్ఫెటేషన్ అరుదుగా జరిగినా జంతువుల్లో మాత్రం తరచూ జరుగుతూనే ఉంటుంది. 


Also read: నూడుల్స్ తరుచుగా తింటున్నారా? మీ శరీరంలో కలిగే మార్పులు ఇవిగో


Also read: బెడ్ మీద కన్నా నేలపై పడుకుంటే ఆ సమస్యలు దూరమైపోతాయి