ఆడదంటే అబల కాదు సబల అని చెప్పుకుంటాం ! మహిళలకు శక్తి స్వరూపిణి అంటాం ! మహిళలు తల్చుకుంటే సాధించలేనిదని చెప్పుకుంటాం ! ప్రతీ మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉటుందని చెబుతాం ! కానీ ఆ మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామా ? అవకాశాలు ఇచ్చే వాతావరణం ఏర్పాటు చేస్తున్నామా ? ధైర్యంగా వారు ప్రపంచంలోకి వచ్చి అన్ని విషయాల్లోనూ సమానత్వం పొందే హక్కును వారికి ఇస్తున్నామా ? 


మాటల్లోనే మహిళల సమానత్వం !


మహిళలకు సమాన అవకాశాలు అనే అంశం ఒక్క ఇండియాకే కాదు.. ప్రపంచం మొత్తానికి సంబంధించిన అంశం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అంశంపై ప్రపంచం మొత్తం చర్చ జరుగుతోంది. నేటికీ మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం ఇంకా అంద‌‌ని ద్రాక్షగానే ఉన్నాయి. ఆకాశంలో సగంగా కీర్తి పొందే మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలు పొందడానికి దూరంగా ఉంటున్నారు. మహిళల అభివృద్ధి స్త్రీ, పురుష సమానత్వంలో అంతరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కొంతమంది మేధావులు ఆడ, మగ సమానమే కానీ మగవాళ్లు కాస్త ఎక్కువ సమానం అని చెబుతుంటారు. దీంతో మహిళా అభివృద్ధి, సమానత్వం అనేవి ఉత్తి మాటలుగానే మిగులుతున్నాయి. కట్టుబాట్లు, సంప్రదాయాల పేరిట నేటి మహిళలు ఇంకా పురుషాధిక్యత కిందే నలుగుతున్నారు. 


రా‌జ్యాంగం సమానమేనంటోంది కానీ పాటించేవారెవరు !?


రాజ్యాంగం స్త్రీ, పురుషులను సమానంగా గుర్తించింది. ఆర్టికల్ 15(3) ప్రకారం మహిళల అభివృద్ధి, ఉన్నతికి రాజ్యం ప్రత్యేక చట్టాలు చేయవచ్చు. ఆర్టికల్ 39(బీ) ప్రకారం పురుషులతో సమానంగా మహిళలకూ వేతనం చెల్లించాలి. ఆర్టికల్ 39(ఏ) ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన జీవన ఉపాధి కల్పించాలి. 15 ఏ(ఈ) ప్రకారం స్త్రీ గౌరవ పరిరక్షణకు ప్రతి పౌరుడు కృషి చేయాలి.  కానీ ఎవరు పాటిస్తున్నారు..? చివరికి చట్ట సభల్లోనూ వారి సంఖ్య తక్కువే.  స్త్రీ, పురుషుల మధ్య అసమానతల విషయంలో భారత్ పరిస్థితి మరీ దారుణం.  భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని గర్వంగా చెప్పుకుంటాం. కానీ లోక్ సభలో11శాతం, రాజ్యసభలో 10.8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లు ఆమోదానికి నోచక మూలనపడి ఉంది. 
  
చట్టాలు కాదు ఆలోచనల్లో మార్పు రావాలి !


చట్టాలు అన్నింటికీ పరిష్కారం కాదు. ఆలోచనల్లోనే మార్పు రావాలి. అమ్మాయిలు అన్నిరంగాల్లో రాణిస్తున్నా... కొన్నిచోట్ల ఇంట్లో పరిస్థితులు బయటకు వెళ్లనిచ్చేలా లేవు. ఏదైనా పని చేస్తూంటే చుట్టూ ఉండే సమాజం ఆడపిల్లవు నీకవసరమా... అని ఎత్తిచూపుతుంది. ఇప్పటికీ చాలా మందికి 18 ఏళ్లు దాటిన వెంటనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు.   పై చదువులు, భవిష్యత్తు గురించి వారు కన్న కలలకు గౌరవం దక్కడం లేదు. వారు ఏది చేయాలన్నా కుటుంబసభ్యులపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా మహిళలు తమ అవకాశాల్ని మొదట్లోనే కోల్పోతున్నారు.   మహిళల ఆలోచనావిధానం కొంతవరకూ మారితే చాలు. వాళ్లను మించిన శక్తిమంతులు మరొకరు ఉండరు.  ఈ రోజుల్లోని సామాజిక పరిస్థితులు, రకరకాల వ్యాపకాల దృష్ట్యా తామేదో బలహీనులమని అనుకుంటున్నారు చాలామంది అమ్మాయిలు. వాళ్లు  ఏదయినా సాధించగలరని అనుకుంటే చాలు... ఎన్నో చేయగలుగుతారు. చిన్నప్పటినుంచీ మగవాళ్లతో పోల్చకుండా... ఆడవాళ్లలో ధైర్యం నూరిపోయగలిగితే వాళ్లను మించినవారు ఉండరు. 


మెల్లగా వస్తున్న మార్పు ! 
  
కొన్నేళ్ల కిందట మహిళలు చదువుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది.  ఇప్పుడు జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో మార్పులు వచ్చాయి.    అప్పట్లో తల్లిదండ్రులే పిల్లల పెంపకంలో తేడాలు చూపించేవారు. అమ్మాయి, అబ్బాయి ఒకే పాఠశాలలో చదువుతున్నా ఇంటి పనులన్నీ ఆడపిల్లతోనే చేయించేవారు. మగవాళ్లు అన్నింట్లో ఎక్కువ అనే మనస్తత్వం అందరిలోనూ ఉండేది.  అప్పటితో పోలిస్తే ఇలాంటి విషయాల్లో ఎంతో కొంత మార్పు వచ్చింది కానీ పూర్తి స్థాయిలో లింగసమానత్వం సాధించడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఇప్పటికే అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రభావం చూపిస్తున్నారు. కానీ వారి సంఖ్య స్వల్పమే. కొన్నాళ్లలో మరింత మెరుగ్గా మహిళలు దూసుకొచ్చే అవకాశం ఉంది. 
  
పురుషుల ఆలోచనల్లో వచ్చే మార్పే సమానత్వానికి దగ్గర దారి ! 
 
పురుషులతో సమానంగా హక్కులు పొందడంలో మహిళలు ఇంకా వెనుకబడి ఉన్నారనేది నగ్నసత్యం.  మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఒక కార్యక్రమంగా జరుపుతున్నాయి కానీ.. మహిళా సమానత్వం గురించి ఆలోచించడం లేదు. చిత్తశుద్ధితో చట్టాలను తీసుకువచ్చి మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అప్పుడే మహిళలు సర్వతోముఖాభివృద్ధి సాధించగలుగుతారు. ఈ విషయాల్లో ముందుగా మార్పు రావాల్సింది మగవారి ఆలోచనల్లోనే. మహిళలు ఏదైనా చేయగలరు అని నిరూపించడానికి వారు నమ్మి వివక్ష ఆపేస్తే సమానత్వం ఆటోమేటిక్‌గా వస్తుంది.