International Men's Day 2024 Theme : మహిళ దినోత్సవం వచ్చిన రోజు.. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే కామెంట్.. మనకి కూడా ఓ రోజు ఉందిరా.. ఆ రోజును కూడా ఇలా సెలబ్రేట్ చేయండి అనుకుంటూ చాలామంది ఫన్నీగా సోషల్ మీడియాలో పోస్ట్​లు, కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే నిజానికి పురుషులకు కూడా ఓ స్పెషల్ డే ఉంది. కానీ ఇది ఎక్కువమందికి తెలీదు. అదే నవంబర్ 19. ప్రతి సంవత్సరం నవంబర్​ 19వ తేదీన అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుతుంటారు. అసలు ఈ రోజు ఎప్పుడు మొదలైందో.. దాని థీమ్ ఏంటో.. ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


ఎప్పుడు మొదలైంది అంటే.. 


ఇప్పుడంటే కనీసం మెన్స్ డే అని చెప్తున్నారు కానీ.. అసలు ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎప్పుడు మొదలైందో తెలుసా? 1999లో స్టార్ట్ చేశారు. డాక్టర్ జెరోమ్ టీలక్​సింగ్ అనే వ్యక్తి తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా దీనిని తొలిసారి నిర్వహించారు. అబ్బాయిలు, పురుషులను ప్రభావితం చేసే సమస్యలపై చర్చించేందుకు ఈ పురుషులు దినోత్సవాన్ని జరుపుకోవాలంటూ మొదలుపెట్టారు. 


ఈ పురుషుల దినోత్సవాన్ని కేవలం సెలబ్రేషన్​లా కాకుండా.. పురుషులు, అబ్బాయిలను ప్రభావితం చేసే సమస్యలను తెరపైకి తెచ్చేందుకు ఈ డేని వినియోగించుకుంటున్నారు. ఆ సమస్యలను అందరూ పరిగణలోకి తీసుకోవాలని కోరారు. నో షేవింగ్ నవంబర్​లో భాగంగా షేవ్ చేయకుండా దాచిన డబ్బులను పురుషుల ఆరోగ్యం కోసం సేకరించే రోజే నవంబర్ 19. ఈ కార్యక్రమాన్నే అంతర్జాతీయ పురుషుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 



అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 2024 థీమ్.. 


ఈ సంవత్సరం అంతర్జాతీయ పురుషులు దినోత్సవం నవంబర్ 19.. అంటే మంగళవారం వచ్చింది. ఈ స్పెషల్​ డే రోజు ఓ థీమ్​ని కూడా ఫాలో అవుతారు. గత సవంత్సరం జీరో మేల్ సూసైడ్​ అనే థీమ్​తో.. మగవారి మానసిక ఆరోగ్యాన్ని హైలైట్ చేశారు. 2024లో థీమ్ ఏంటంటే.. మగవారిలో రోల్​ మోడల్​గా నిలిచినవారిని ప్రమోట్ చేయడం, మగవారు హెల్త్​ గురించి శ్రద్ధ తీసుకోవాలని సూచించడం, లింగ సమానత్వాన్ని ప్రమోట్ చేయడం, మగవారి మానసిక స్థితిపై జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యంగా వస్తున్నారు. 



ప్రాముఖ్యత ఇదే.. 


పురుషులు సమాజానికి చేసే సానుకూల సహకారాలను గుర్తించి.. సమాజంలో వారి ప్రాముఖ్యతను హైలైట్ చేయడమే అంతర్జాతీయ పురుషులు దినోత్సవ లక్ష్యం. మగవారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలను ఓపెన్​గా డిస్కస్ చేసి.. వాటిని పరిష్కరించే చర్యలను తీసుకుంటారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సాహిస్తూ.. మగవారిలో రోల్​ మోడల్​గా ఉన్నవారిని గుర్తించి.. వారిని సత్కరిస్తారు. ఆరోగ్యానికి, ఆనందానికి కూడా సమయాన్ని కేటాయించడమే లక్ష్యంగా ఈ మెన్స్​డేని ముందుకు తీసుకువెళ్తున్నారు. 



మగవారి ఫీలింగ్స్​ని, వారిలోని మానసిక సంఘర్షణలను గుర్తించి.. వారికి సపోర్ట్ ఇవ్వాలనేదే ఈ అంతర్జాతీయ పురుషులు దినోత్సవ లక్ష్యం. మగవారి కష్టాన్ని కూడా గుర్తించి.. వారికి ఆదరణ అందించాలని.. ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. మగవారు కూడా ఆరోగ్యంపై, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని గుర్తు చేసేదే ఈ మెన్స్ డే. 


Also Read : మగవారిలో గుండె సమస్యలు పెరగడానికి కారణం ఇదే.. కారకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు