International Girl Child Day: ప్రతి ఏడాది అక్టోబర్ 11న ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’నిర్వహిస్తారు. ఇంట్లో ఆడపిల్లలు ఎంత ముఖ్యమో, వారి ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడం ఎంత అవసరమో చెప్పేందుకే ఈ దినోత్సవం. ఐక్యరాజ్య సమితి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని 2012లో ప్రవేశపెట్టింది. అప్పట్నించి ఈ దినోత్సవాన్ని ప్రతి ఏడాది నిర్వహించడం మొదలుపెట్టారు. ఇంటా, బయటా ఆడపిల్లలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిని తీర్చాల్సిన బాధ్యత అందరికీ ఉంది. వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇంట్లోని పెద్దవారిదే. ముఖ్యంగా తల్లిదండ్రులు అమ్మాయిలో రక్తహీనత వంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్య ఎక్కువ మంది ఆడపిల్లలను వేధిస్తోంది.
రక్తహీనత ఎందుకు వస్తోంది...
అబ్బాయిల్లో రక్త హీనత సమస్య ఎక్కువ కనిపించదు, కానీ ఆడపిల్లల్లో అధికంగా కనిపిస్తుంది. దానికి కారణం ప్రతి నెలా వచ్చే రుతు స్రావం. ఈ సమయంలో ఎక్కువ రక్తం పోవడం వంటి సమస్యల వల్ల ఆడపిల్లలు త్వరగా అనిమియా బారిన పడతారు. అందుకే వీరికి రక్తాన్ని అధికంగా ఇచ్చే ఆహారాన్ని రోజూ తినిపించాలి. అంటే ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని పెట్టాలి. ఇనుము తగినంత ఉంటే రక్తం ఉత్పత్తి కూడా సక్రమంగా సాగుతుంది.
ఏం పెట్టాలి?
ఇనుము అధికంగా ఉండే ఆహారాలను ప్రత్యేకంగా ఎంచుకోవాలి. ఉదయం లేవగానే గుప్పెడు గుమ్మడి గింజలను ఇచ్చి తినమని చెప్పాలి. ఇందులో ఐరన్ అధికంగా ఉండి ఎర్రరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే చికెన్ లివర్, క్వినోవా వంటివి రెండు మూడు రోజుకోసారి తినిపించాలి. అలాగే కొమ్ము శెనగలు రోజూ నానబెట్టి కాస్త పోపు వేసి వాటిని ఇవ్వాలి. వీటి రుచి కూడా బావుంటుంది కాబట్టి పిల్లలు తినేస్తారు. సూపర్ మార్కెట్లలో బ్రకోలీ దొరుకుతుంది. వాటిని సన్నగా తరిగి కాస్త సలాడ్ లా చేసి ఇస్తే బెటర్. సోయా బీన్స్ తో చేసిన టోఫు (పనీర్ లా ఉంటుంది) అన్నీ సూపర్ మార్కెట్లలో ఉంటుంది. దాన్ని వండి వడ్డించినా మంచిదే. ఇందులో ఐరన్ అధికంగానే ఉంటుంది.
పిల్లలు ఇష్టంగా తినే డార్క్ చాక్లెట్ను రోజుకు చిన్న ముక్క ఇవ్వాలి. 28 గ్రాముల డార్క్ చాక్లెట్లో 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. చేపలు మూడు రోజుకోసారి తినిపిస్తే మంచిది. చేపల్లో ఇనుమే కాకుండా ఆడపిల్లల శరీరానికి అవసరమయ్యే పోషకాలెన్నో ఉంటాయి.
రక్తహీనత లక్షణాలు...
శరీరంలో రక్తం అవసరమైన దాని కన్నా తక్కువగా ఉండడమే రక్త హీనత. ఈ సమస్య ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రంగా అలిసిపోతారు, ఆకలి వేయదు, తరచూ మైకం వచ్చినట్టు అనిపిస్తుంది, అరచేతుల్లో చెమట పడుతుంది. పాదాల్లో నీరు చేరుతుంది. నాలుక, కళ్లల్లో ఎరుపుదనం తగ్గి పాలిపోయినట్టు అవుతుంది. చర్మం కూడా పాలిపోయినట్టు కనిపిస్తుంది. పిల్లలు చదువులో ఆసక్తి చూపించరు. వెనుకబడతారు.
Also read: ఈ ఆకులు రోజూ నమిలితే కంటి చూపు సూపర్, భవిష్యత్తులో సైట్ వచ్చే అవకాశమే ఉండదు
Also read: ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే అయిదు అద్భుతమైన ఆహారాలు ఇవిగో, వీటిని రోజూ తినండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.