భోజనం పూర్తయ్యాక చివర్లో తమలపాకులు నమిలితే కానీ ఆ భోజనం తిన్నట్టు అనిపించదు చాలా మందికి. దేవుడి పూజ, నోములు, వ్రతాలు అంటే చాలు అక్కడ తమల పాకులు కట్టలు కట్టలు కనిపిస్తాయి. ఇంతే వీటి లాభాలు అనుకుంటారు చాలా మంది. కానీ తమలపాకులు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా కంటి చూపును కాపాడుకోవడానికి తమలు పాకులు తినడం చాలా అవసరం. అలాగే నిద్రలేమి కారణంగా చాలా మంది ఇబ్బందులు పడతారు. వికారంగా అనిపించడం, మలబద్ధకం, అసిడిటీ వంటివి కలుగుతాయి. ఇవన్నీ పోవాలంటే చక్కగా నిద్రపోవాలి. నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల కంటి పనితీరు కూడా దెబ్బతింటుంది. నిద్ర బాగా పట్టాలన్నా, కంటి చూపు మెరుగుపడాలన్నా కూడా రోజు తినాల్సిన ఆకులు తమల పాకులు. రోజుకు రెండు ఆకులు తొడిమను తీసేసి నమిలి వేయాలి. అందులో చిన్న పిసరు పచ్చకర్పూరం పొడి వేసి నమిలి వేస్తే మంచి ఫలితం ఉంటుంది. 


కిళ్లీలను అందరూ తింటారు. కానీ అందులో వాడే పదార్థాల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఒట్టి తమలపాకు తిన్నా మంచిదే లేదా, పచ్చ కర్పూరం అతి తక్కువ పరిమాణంలో కలుపుకుని తిన్నా మంచిదే. తమలపాకుకు కాస్త వెన్న రాసి పైన చిటికెడులో సగం పచ్చకర్పూరం పొడి వేసి తింటే ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. ఒకేసారి నమిలి మింగేయకుండా బుగ్గలో నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా కొన్ని రోజుల పాటూ చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడడంతో పాటూ నిద్ర బాగా పడుతుంది. అసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కంటి సమస్యలు ఏవైనా అంటే కళ్లు మంటలు అనిపించడం, నీరు కారడం, ఎర్రబడడం వంటి సమస్యలనీ ఇలా తమలపాకును నమలడం వల్ల పోతుంది. 


ఇంకా ఎన్నో లాభాలు
రోజుకో తమలపాకు నమలడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటిల్లో కాల్షియం, ఇనుము, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది ఆకలిని పెంచుతుంది. ఆహారం అరిగేలా చేస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారికి తమలపాకు తినడం వల్ల లాభం కలుగుతుంది. కడుపుబ్బరంగా అనిపించినప్పుడు రెండు తమలపాకులు నమిలేసి కాస్త పాలు తాగితే మంచిది. తమలపాకు తినడం జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి. ఆహారం త్వరగా అరుగుతుంది. 


Also read: ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే అయిదు అద్భుతమైన ఆహారాలు ఇవిగో, వీటిని రోజూ తినండి



Also read: బ్రేకప్ అయ్యాక మానసికంగా కుంగిపోయారా? ఇలా బయటపడండి




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.