Munugode ByPolls : మునుగోడు ఉపఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకూ సవాల్. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు మునుగోడు ఓటర్ల నాడి మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎలాంటి గాలి మునుగోడులో లేదు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వాదనను నమ్మించి ఓట్లు పొందాలని అనుకుంటున్నాయి. అయితే  ప్రజలు ఏమనుకుంటున్నారో మాత్రం బయటకు కనిపించనీయడం లేదు. గుంభనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలన్నీ తమ తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నాయి. 


ఎలాంటి అజెండా లేకుండా ఉపఎన్నికలు !


సాధారణంగా ఉపఎన్నికలు ఓ కారణంతో వస్తాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ కారణంతో రాజీనామాలు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో  కేసీఆర్ పార్టీ నుంచి గెంటేశారు కాబట్టే రాజీనామా చేశానని ఈటల రాజేందర్ జనంలోకి వెళ్లారు. అయితే  ఇప్పుడు మునుగోడుకు ఉపఎన్నికలు ఏ కారణంతో వచ్చాయన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంకా గట్టిగా ఏడాది కూడా పదవి కాలం లేని మునుగోడుకు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం ఎందుకు.. మళ్లీ బీజేపీ తరపున పోటీ చేయడం ఎందుకన్నది చాలా మంది ఓటర్లకు అర్థం కాని విషయం. బీజేపీకి కూడా అసలు ఎన్నిక ఎందుకు వచ్చిందన్నది చర్చకు రాకపోతే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. టీఆర్ఎస్ అయితే అసలు ఎన్నిక ఎందుకు వచ్చిందో చెప్పి.. ప్రజల్ని అప్రమత్తం చేయాలనుకుంటోంది. కాంగ్రెస్ .. ఆ రెండు పార్టీలు ఒకటేనని చెబుతోంది. అయితే ప్రజలు ఎవరి వాదనను విశ్వసిస్తున్నారో మాత్రం స్పష్టత లేదు. 


ఉపఎన్నిక ఎందుకంటే చెప్పుకోలేని స్థితిలో బీజేపీ !


ఉపఎన్నిక పూర్తిగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి వల్లనే వచ్చింది. నాలుగేళ్లపాటు ఆయన టీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా రాజీనామా  చేశారు. ప్రజల కోసమే చేశానని ఆయన చెబుతున్నారు. నాలుగేళ్లలో చేయని రాజీనామా ఇప్పుడెందుకు చేశారనేది చాలా మందికి వస్తున్న సందేహం. దానికి సమాధానంగా కాంట్రాక్టుల్ని తెరపైకి తెచ్చాయి విపక్షాలు. దీన్ని కవర్ చేసుకోవడానికి రాజగోపాల్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారు. 


రాజగోపాల్ రెడ్డిపై వ్యతిరేకతనే నమ్ముకుంటున్న టీఆర్ఎస్ !


మరో వైపు రాజగోపాల్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని టీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన ప్రజల్ని మోసం చేశారని.. రూ. ఇరవై వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే ఆయన ఉపఎన్నిక తీసుకొచ్చి పెట్టారని విమర్శలు చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా ఉన్న తమకే పట్టం కట్టాలని కోరుతున్నారు. వీరి ప్రచారం కూడా ఎజెండా లేకుడానే సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తి ని పెంచి ఓట్లు పొందాలనుకుంటోంది. అంతే కానీ గతంలోలా తెలంగాణ వంటి పవర్ ఫుల్ ఎజెండాతో ముందుకు రాలేకపోయింది. 


పాత సేవల్నే గుర్తు చేసుకోవాలంటున్న కాంగ్రెస్!


ప్రస్తుత పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఓ రకంగా ప్లస్ ..మైనస్ లాంటిది. కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో అధికారంలో లేదు. దీంతో ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నాయి. తెలంగాణ ఇచ్చినపార్టీగా ఓ భావోద్వేగాన్ని సృష్టించి తమ వైపు ఓట్లు మల్చుకోవాలనుకుంటోంది. కానీ అలాంటి అంశమే  కాంగ్రెస్ పార్టీకి కనిపించడం లేదు. 


రాజకీయ పార్టీలు ఓ వేవ్ సృష్టించగలిగితే సునాయాసంగా గెలుస్తాయి. ఎలాంటి వేవ్ లేకపోతే ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. ప్రస్తుతం మునుగోడులో అలాంటి పరిస్థితే  ఉందనుకోవచ్చు.