భారతీయ రైల్వే ఇ-టికెటింగ్ విభాగం IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ద్వారా ఆన్‌లైన్ రైలు బుకింగ్‌లపై రూ. 10 లక్షల వరకు బీమా కవరేజీ పొందే అవకాశం ఉంది. ఈ బీమా కోసం ప్రయాణీకులు చెల్లించాల్సిన మొత్తం జస్ట్ 49 పైసలు. IRCTC వెబ్‌సైట్ ప్రకారం, ఒక PNR (ప్యాసింజర్ నేమ్ రికార్డ్) కింద బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ  ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. IRCTCలో రైలు టిక్కెట్లను బుక్ చేస్తున్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 


IRCTC ప్రయాణ బీమా పథకం గురించి 10 కీలక విషయాలు  మీకోసం..


1. IRCTC వెబ్‌సైట్ లేదా దాని మొబైల్ యాప్ ద్వారా తమ ఇ-టికెట్‌లను బుక్ చేసుకునే భారతీయ పౌరులకు మాత్రమే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కాబట్టి, మీరు కౌంటర్‌లో కాకుండా IRCTCలో టికెట్ బుక్ చేసుకోవడమే ఉత్తమం. 


2. ఒక ప్రయాణీకుడు బీమాను ఎంచుకుంటే.. క్లెయిమ్/బాధ్యత బీమా చేసిన వ్యక్తి, బీమా కంపెనీ మధ్యే ఉంటుంది.


3. రైలు ప్రమాదం లేదా అవాంఛనీయ సంఘటనల్లో ప్రయాణీకుడు చనిపోయినా? శాశ్వత పూర్తి వైకల్యం పొందినా? శాశ్వత పాక్షిక వైకల్యం బారిన పడ్డా? లేదంటే గాయపడినా? ఆసుపత్రిలో చేరే ఖర్చుల విషయంలో PNR కింద ప్రతి ప్రయాణీకునికి IRCTC ప్రయాణ బీమా పథకం కవరేజ్ వర్తిస్తుంది. రైల్వేలు అందించే బీమా రక్షణ వివరాలు ఇక్కడ ఉన్నాయి:


⦿ మరణం- రూ.10,00,000


⦿ శాశ్వత, పూర్తి వైకల్యం- రూ. 10,00,000


⦿ శాశ్వత పాక్షిక వైకల్యం- రూ. 7,50,000


⦿ గాయపడిన వారికి ఆసుపత్రి ఖర్చుల కోసం- రూ. 2,00,000


4. ప్రయాణ బీమా పథకం అన్ని తరగతులకు ప్రయాణీకులకు ఒకేలా ఉంటుంది.


5. బీమా పాలసీని ఎంచుకున్నప్పుడు, వినియోగదారుడు పాలసీ సమాచారాన్ని SMS ద్వారా, రిజిస్టర్డ్ ఇమెయిల్ IDల ద్వారా నేరుగా బీమా కంపెనీల నుంచి నామినేషన్ వివరాలను పూరించడానికి లింక్‌ అందుతుంది. IRCTC పేజీ నుంచి టికెట్ బుక్ చేసినప్పుడు కూడా పాలసీ నంబర్‌ చూసే అవకాశం ఉంటుంది.  


6. టికెట్ బుకింగ్ తర్వాత, నామినేషన్ వివరాలను సంబంధిత బీమా కంపెనీ వెబ్‌సైట్‌లో నింపాలి. ఒకవేళ నామినేషన్ వివరాలు పూరించనట్లయితే, IRCTC ప్రకారం, క్లెయిమ్ వస్తే.. వారి వారసులకు ఆ మొత్తాన్ని అందిస్తారు.


7. ఏదైనా కారణంతో రైళ్లను నిలిపివేసినట్లయితే, ప్రయాణీకుడు గమ్యస్థాన స్టేషన్ వరకు రైల్వే ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని ఎంచుకుంటే, ప్రయాణీకుల ప్రయాణంలో ఈ భాగం కూడా తీసుకున్న పాలసీ కింద కవర్ అవుతుంది.  


8. ఏదైనా కారణం వల్ల రైలు మళ్లింపు జరిగితే, మళ్లించిన మార్గానికి కవరేజ్ వర్తిస్తుంది.


9. ప్రయాణీకులు ప్రీమియం చెల్లించిన తర్వాత క్యాన్సిల్ చేయడం కుదరదు.


10. IRCTC పోర్టల్ ప్రకారం ప్రయాణ బీమా ఐదేళ్లలోపు పిల్లలకు అందించబడదు.


మొత్తంగా రైల్లో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణీకుడు తప్పకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. జరగకూడని  సంఘటనలు జరిగితే బీమాను అందుకోవచ్చు.


Also Read: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!


Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!