తీవ్ర ఉత్కంఠ రేపిన మునావర్‌ ఫారుఖీ కామెడీ షో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగింది. భారీ బందోబస్తు మధ్య షోను నిర్వహించారు. షో జరుగుతన్నంతసేపు శిల్పకళావేదిక నిఘా నీడలో ఉంది. శిల్పకళావేదిక లోపల స్టాండప్ కామెడీ నడుస్తుంటే... బయట మాత్రం హైటెన్షన్ కనిపిచింది. షో నడుస్తున్నంత సేపు పోలీసుల అలర్ట్‌గానే ఉన్నారు. అనుమానాస్పదంగా కనిపించేవారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. 


మునావర్ చేరుకున్నారని తెలుసుకున్న బీజేపీ శ్రేణులు బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా అక్కడకు చేరుకున్నారు. పోలీసులు అలెర్ట్‌ అయి వారందర్నీ అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు సరికొత్త ఎత్తుగడ వేశారు. ఈసారి ఏకంగా పోలీసు డ్రెస్సుల్లోనే షోలోకి ఎంటర్ అయ్యేందుకు ట్రై చేశారు. అయినా పోలీసులు వారిని పసిగట్టి పోలీసు వాహనాల్లో తరలించారు.   


శిల్పకళావేదికలో నడుస్తున్న మునావర్‌ కామెడీ షోను అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నించాయి. బులెట్ ఫ్రూఫ్‌ వాహనంలో ఐదు గంటలకు వచ్చిన మునావర్... షోను స్టార్ట్ చేశారు. శిల్పకళావేదికకు ఉన్న మూడు గేట్ల నుంచి కూడా షోలోకి ఎంటర్ అయ్యేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు. అలెర్ట్‌గా ఉన్న పోలీసులు మాత్రం వాళ్ల ప్రయత్నాలును చిత్తు చేశారు. అందుకే ఓ దశలో ఎస్‌వోటీ పోలీసు డ్రెస్‌లో వచ్చేందుకు ప్రయత్నించిన వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.  


స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో షో చేస్తున్నారని చెప్పినప్పటి నుంచి టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ షోకు టిక్కెట్లను బుక్ మై షో పూర్తిగా విక్రయించింది. మునావర్ ఫారుఖీ రాక విషయాన్ని కూడా పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆయనకు పూర్తి భద్రత కల్పించారు. శిల్పకళా వేదిక చుట్టూ పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు.  మునావర్ ఫారుఖీ షోకు అనుమతులు ఉన్నాయని మాదాపూర్ డీసీపీ ప్రకటించారు. ఎవరైనా అశాంతి సృష్టించాలని చూస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సాయంత్రం షో మొదలై ముగిసే వరకు అన్ని‌చోట్ల బందోబస్తు తీవ్రం చేశారు. 


స్టాండప్ కామెడీ షో వేదికను తగలబెడతామని.. షో జరుగుతున్నప్పుడు.. ఫారుఖీపై దాడి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు లాలాగూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీతాదేవిపై జోకులు వేయడంతో మునావర్ షోలు వివాదాస్పదంగా మారాయి. కర్ణాటకలో మునావర్ కామెడీ షోలపై ఇప్పటికే బ్యాన్  కొనసాగుతోంది. హైదరాబాద్‌లోనూ మునావర్ షోలు నిర్వహించకూడదంటూ రాజాసింగ్‌తోపాటు బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 


బీజేవైఎం కార్యకర్తలు షో టికెట్స్ తీసుకున్నట్లు రాజాసింగ్ ప్రకటించడంతో నిర్వాహకులు.. పోలీసులు అప్రమత్తమయ్యారు.  అ గతంలో బెంగళూరులో మునావర్ ఫారుఖీ స్టాండర్ కామెడీ షో చేయాల్సింది. చివరి క్షణంలో అక్కడి ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. దాంతో  షో జరగలేదు. ఆ సమయంలో ఈ అంశంపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. మునావర్‌ను హైదరాబాద్‌లో షో చేసుకోవచ్చని ఆహ్వానించారు. తాము చివరి క్షణంలో అనుమతులు రద్దు చేయబోమన్నారు. .


అందుకే జరిగేది స్టాండప్ కామెడీ అయినా విషయం మాత్రం సీరియస్‌గా మారింది. ఈ ఏడాది జనవరిలో మునావర్ ఫరూఖీ హైదరాబాద్ లో షో జరపాలని ప్లాన్ చేశారు. అయితే కొవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు మునావర్ షోను ఏర్పాటు చేశారు. మాటకు తగ్గట్లుగానే బీజేపీ ఎమ్మెల్యే.. హిందూ సంస్థల నుంచి వ్యతిరేకత వచ్చినా షోలకు అనుమతి ఇచ్చారు. పోలీసుల పటిష్ట చర్యల కారణంగా ఎలాంటి  వివాదాలు లేకుండానే షో ప్రశాంతంగా జరిగింది.