గత అయిదేళ్లుగా యోగాను అనుసరించే వారి సంఖ్య చాలా పెరిగింది. నిజానికి యోగా ఇప్పటిది కాదు, ప్రపంచంలోని పురాతన శాస్త్రాలలో యోగా ఒకటి. పురాణాలలో యోగా జ్ఞానాన్ని అందించిన మొదటి వ్యక్తి శివుడిని ప్రస్తావిస్తారు. ఇప్పటికి చాలా శివుడి వాల్ పేపర్లు ఆయన ఒంటికాలిపై నిల్చుని నమస్కరిస్తున్నట్టు ఉంటాయి. అది కూడా యోగా భంగిమే. ఇక చరిత్రలో యోగా గురుగా పతంజలి మహర్షి పేరే చెబుతారు. యోగా పుట్టుక వెనుక కథలు ప్రచారం ఉన్నాయి. అన్ని కథలు చెప్పేది మాత్రం ఒకటే యోగా జన్మస్థలం భారతదేశమే. ఇక్కడ్నించే ప్రపంచ దేశాలకు పరిచయం అయింది ఈ అద్భుత శాస్త్రం. యోగా గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటేందుకు ప్రతి ఏడాది జూన్ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ నిర్వహిస్తారు. 


యోగా మూలాలు ఎక్కడంటే...
యోగా మూలాలు 5000 ఏళ్ల క్రితం ఉత్తర భారతదేశంలో కనిపెట్టారు. యోగా అనే పదం మొదట రుగ్వేదంలో ప్రస్తావించినట్టు చెబతారు. రుగ్వేదం వేదాలలో అతి ప్రాచీనమైనది. ఎంతో రుషులు పూర్వకాలంలో యోగా ద్వారానే ఎక్కువ కాలం జీవించే వారని అంటారు. వారే యోగాను మరింత  అభివృద్ధి చేశారు. యోగా అనేది హిందూ, బౌద్ధమతాలలో ఎంతో గౌరవాన్ని   పొందాయి. యోగాకు అంకితం చేసిన ‘శ్రీ యోగేంద్ర మ్యూజియం ఆఫ్ క్లాసికల్ యోగా’ను సందర్శిస్తే యోగా చరిత్ర గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చు. ఈ మ్యూజియం ముంబైలో ఉంది. 


యోగాలో చాలా పదాలు పలకడానికే కొత్తగా ఉంటాయి. ఎందుకంటే అవన్నీ సంస్కృతం నుంచి ఉద్భవించినవి. అనేక భారతీయ భాషలకు మూలం సంస్కృతమే. యోగా పితామహుడిగా పతంజలి మహర్షిని చెప్పుకుంటారు.ఎందుకంటే ఆయన యోగాకు సంబంధించిన శ్లోకాలను ఒక నిర్ధిష్ణ పద్ధతిలో క్రోడీకరించాడు. దాదాపు 196 శ్లోకాలు లేదా సూత్రాల సమాహారం యోగా శాస్త్రం. ఇందులోనే ఎన్నో ఆసనాల గురించి వివరించారు. 


ఆదియోగి సృష్టి
భూమిపై యోగాను పరిచయం చేసింది ఆదియోగి అని చెబుతారు. ఆదియోగి ఎవరో కాదు సాక్షాత్తూ ఆ శివుడే. అతడిని మనం దేవుడిగా పూజిస్తున్నాం. కానీ అప్పట్లో కొంతమంది ఆయన్ను మానవుడిగానే భావించే వారు. కాకపోతే ఆయన భౌతిక ప్రపంచం పరిమితులను దాటి ఎదిగిన మానవుడిగా చెబుతారు. రాముడు, కృష్ణుడు ఎలా మానవరూపంలో సంచరించారో, శివుడు కూడా ఆదియోగిగా భూమిపై సంచరించారని కొందరి నమ్మకం. 


యోగా అంటే...
యోగా అనే పదం సంస్కృత మూలం 'యుజ్' నుండి ఉద్భవించింది. దీని అర్థం ' ఒక దగ్గరికి చేర్చడం' లేదా 'ఏకం చేయడం' అని. యోగ గ్రంధాల ప్రకారం యోగాభ్యాసం ఒక మనిషి వ్యక్తిగత స్పృహను, సామాజిక స్పృహతో ఏకం చేస్తుంది. మనస్సు, శరీరం మధ్య సంపూర్ణ ఏకత్వాన్ని అందిస్తుంది. 


Also read: ఫాదర్స్ డే పుట్టుక వెనుక గుండెలు బరువెక్కే చరిత్ర, మనసు కరగాల్సిందే


Also read: దీపిక పదుకోన్ ఆరోగ్య సమస్య ఇదే, అందుకే ఆసుపత్రికి వెళ్లింది, ఈ సమస్య ఎవరికైనా రావచ్చు