Basar Rajiv Gandhi University of Knowledge Technologies News: బాసరలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) విద్యార్థులు చేస్తున్న నిరసనలకు మంత్రి కేటీఆర్‌ స్పందించారు. వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ట్విటర్ ద్వారా వెల్లడించారు. విద్యార్థుల లేవనెత్తిన సమస్యలను సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. బత్తిని తేజ గౌడ్ అనే ఆర్జీయూకేటీ స్టూడెంట్ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.


‘‘కేటీఆర్ సర్. ఆర్జీయూకేటీ గురించి ఆలోచించండి. 8 వేల మంది విద్యార్థులు రోడ్డుపై కూర్చున్నారు. మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాం’’ అంటూ విద్యార్థి ట్వీట్ చేశాడు. దీనిపై కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డిని ట్యాగ్ చేస్తూ స్పందించారు. 


కేటీఆర్ ట్వీట్‌పై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. ‘‘యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను మీటింగ్‌కు పిలిచాము. అక్కడ ఉన్న సమస్యలపై చర్చించి వీలైనంత త్వరగా అన్నింటినీ పరిష్కరిస్తాం’’ అని ట్వీట్ చేశారు.


విద్యార్థుల డిమాండ్లకు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కూడా మద్దతు పలుకుతున్నారు. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా విద్యార్థుల డిమాండ్లను ట్వీట్ చేశారు.






విద్యార్థుల డిమాండ్లు ఇవే..



  • ఆర్జీయూకేటీ క్యాంపస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ కచ్చితంగా విజిట్ చేయాలి

  • వీసీ కచ్చితంగా క్యాంపస్‌లోనే ఉండాలి. డైరెక్టర్, ఫినాన్స్ ఆఫీసర్ వంటి అన్ని పోస్టులను భర్తీ చేయాలి.

  • ఫ్యాకల్టీ, స్టూడెంట్ రేషియో పరిగణనలోకి తీసుకోవాలి.

  • ICT (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి.

  • పీయూసీ బ్లాక్‌లు, హాస్టళ్లను రినోవేషన్ చేయించాలి.

  • లైబ్రరీలను మెరుగుపర్చాలి. వాటి టైమింగ్స్‌ను పెంచాలి.

  • విద్యార్థులకు కనీస సౌకర్యాలను (మంచాలు, బెడ్స్, యూనిఫామ్స్) కల్పించాలి.

  • మౌలిక సదుపాల (ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇంటర్నెట్) మెయింటెనెన్స్ సరిగ్గా ఉండాలి

  • మెస్‌లో సదుపాయాల మెయింటెనెన్స్ బాగా చేయాలి.

  • క్యాంటిన్, బీబీ టెండర్లు తీసుకున్న వారి అవినీతి, ఆక్రుత్యాలను అరికట్టాలి.

  • స్పోర్ట్స్ కోసం పీఈడీ, పీఈటీ, ఇతర సామగ్రి వసతులను కల్పించాలి.

  • ఇతర వర్సిటీలతో కొల్లాబొరేషన్స్ చేయాలి.






ఆర్జీయూకేటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి


బాసర ఆర్జీయూకేటీ లో నెల‌కొన్న స‌మ‌స్య‌లు త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, ఆర్జీయూకేటీ విద్యాల‌యంలో సౌక‌ర్యాలు, ఇత‌ర అంశాల‌ను సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసువెళ్తానని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హ‌మీ ఇచ్చారు. భ‌విష్య‌త్ లో ఎలాంటి స‌మ‌స్య‌లు తెత్త‌కుండా అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని భరోసా ఇచ్చారు.