Telangana In Financial Crisis, Ready for open debate: Eteala Rajender: ఓ వైపు తాను జాతీయ స్థాయి నేతనని, దేశాన్ని కాపాడాలంటే తనలాంటి వ్యక్తి నాయకత్వం అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్నారు. అందుకోసం ఏకంగా బీఆర్ఎస్ అనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రజలే కేసీఆర్‌కు వీఆర్ఎస్ ఇస్తామని చూస్తుంటే కేసీఆర్ బీఆర్ఎస్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో కేంద్రంలో బీజేపీ ఎనిమిదేళ్ల ప్రజా సంక్షేమ పాలన బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే ఈటల మాటల తూటాలు పేల్చారు.
ముందస్తుకు వెళ్లినా గెలిచేది మేమే..
బీజేపీ ఎనిమిదేళ్ల ప్రజా సంక్షేమ పాలన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మార్చిలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని.. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మాత్రం బీజేపీనేనని ఈటల స్పష్టం చేశారు. గతంలో ముందస్తుకు వెళ్లిన కేసీఆర్.. ఇప్పుడు కూడా ముందస్తుకు వెళ్తారని అంటున్నారని, పాలన చేత కాకుంటే కేసీఆర్ ఇప్పుడే దిగిపోవాలని డిమాండ్ చేశారు. సీఎం కుర్చీ ఎడమకాలి చెప్పుతో సమానం అన్న కేసీఆర్‌కు ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.
ఓటమి భయంతో కేసీఆర్..
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను ఆశ్రయించారని ఆరోపించారు. కానీ ఇది బిహార్ కాదని ఉద్యమాల గడ్డ, పోరు గడ్డ తెలంగాణ అని గుర్తు చేశారు ఈటల రాజేందర్. హుజురాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు కేసీఆర్ రూ.4600 కోట్లు ఖర్చు పెట్టారని.. కానీ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు.
తెలంగాణ వచ్చినప్పుడు 74 వేల కోట్లు అప్పు ఉంటే.. ఇప్పుడు అది 5 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని నిరూపించేందుకు అబిడ్స్ సెంటర్ లోనైనా చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పెద్దలకు, కేసీఆర్‌కు సవాల్ చేశారు ఈటల. గూట్లో రాయి తియ్యనోడు ఏట్లో రాయి తీస్తాడంటే.. ఏ రాష్ట్రం కూడా నమ్మడం లేదన్నారు. రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్ లేకుంటే తన ఫామ్ హౌస్ లోకి కేసీఆర్ రానివ్వరని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ మంత్రికి సొంతంగా అధికారం లేదని, కట్టు బానిసల్లగా, జీవచ్ఛవాల్లా బతుకుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.