Minister KTR : తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్న సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందన్నారు. రాష్ట్రంలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థలకు తప్పకుండా ప్రభుత్వం పరంగా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. స్థానికంగా పెట్టుబడులు పెట్టి, తయారీ యూనిట్లు నెలకొల్పోవారికి ఇప్పటికే వివిధ పాలసీలు తీసుకువచ్చామన్నారు. హైటెక్‌ సిటీ హుడా టెక్నో ఎన్‌క్లైవ్‌లో జాన్సన్‌ కంట్రోల్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఓపెన్‌బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ భారత్‌లో నైపుణ్యత ఉన్న ఉద్యోగులకు కొదవలేదన్నారు. వ్యాపార విస్తరణతో పాటు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినందుకు  జాన్సన్‌ కంట్రోల్‌ సంస్థకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.






తయారీ రంగానికి హైదరాబాద్ కీలకం!


హైదరాబాద్ నగరం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్టుబడిదారులు ఇకపై దేశంలోని ఏ రాష్ట్రం వైపు చూడాల్సిన అవసరం లేదన్నారు. జాన్సన్‌ కంట్రోల్‌ సంస్థ పదేళ్లపాటు హైదరాబాద్ లో వ్యాపారం చేస్తుందన్నారు. భాగ్యనగరం ఎంతలా అభివృద్ధి చెందిందో వారికి తెలుసన్నారు. రాష్ట్రంలో ఎన్ని వ్యాపార అవకాశాలు ఉన్నాయో, ఇక్కడ ఎంత సులభంగా వ్యాపారం చేయ్యొచ్చో ఇప్పటికి ఆ సంస్థ ప్రతినిధులకు అర్థమైందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ సెంటర్‌ టీ-హబ్‌, టీ-సెల్‌ హైదరాబాద్‌ నగరంలోనే ఉన్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. ఇమేజ్‌ టవర్స్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నామన్నారు. మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగానికి హైదరాబాద్‌ కీలకంగా మారబోతున్నదని వెల్లడించారు. తెలంగాణలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.